YSRCP Incharges Changes in Assembly Constituencies: అధికార వైఎస్సార్సీపీలో నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల మార్పు జోరందుకుంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సీట్లు మార్చిన సీఎం జగన్, సోమవారం తాజాగా మరో మంత్రినీ సిట్టింగ్ సీటు నుంచి మార్చేశారు. ఇప్పుడు ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ ఎమ్మెల్యేలకూ స్థానచలనం తప్పలేదు.
ఇప్పటికే 11 నియోజవర్గాల్లో కొత్త సమస్వయకర్తలను నియమించిన సీఎం, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేల స్థానాలకు ఎసరు పెట్టారు. వీరిలో కొందరికి స్థానచలనం తప్పదని, మరికొందరికి అసలు టికెట్ ఉండదని తేల్చి చెప్పేశారు. పార్టీ తిరిగి అధికారంలోకొస్తే మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి పంపినట్లు సమాచారం. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో ముఖ్యమంత్రి మాట్లాడారు.
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, జ్యోతుల చంటిబాబు, ఎలీజా, కొండేటి చిట్టిబాబు, టి.బాలరాజు తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. వీరదందరితో గతవారం నుంచి సంప్రదింపులు జరుపుతున్న ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి, సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వారితో చర్చలు జరిపారు. తర్వాత ముఖ్యమంత్రి వద్దకు వెళ్లారు.
నేనున్నానంటూ నేతలను నమ్మించిన జగన్-సొంత మనుషుల్లా నమ్మిన వారి సీట్లకే ఎసరు పెట్టిన వైసీపీ అధిష్టానం
త్వరలోనే స్పష్టత: 2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైఎస్సార్సీపీకు మద్దతు పలికిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరికి ఇప్పటికే స్థానం లేకుండా చేశారు. తన భవిష్యత్తు ఏంటని సీఎంను కలిసి మాట్లాడినట్లు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని పార్టీ అధినాయకత్వానికి చెప్పేశారంటున్న ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన విషయంలో సీఎం ఏ నిర్ణయం తీసుకున్నారనే దానిపై నేడో రేపో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కొత్త సమన్వయకర్తల ప్రకటనతో స్పష్టత వస్తుందంటున్నారు.