Funeral: వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అంతిమ సంస్కారాలు.. ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలో నిర్వహించారు. డ్రైవర్ మృతికి ఎమ్మెల్సీనే కారణమంటూ.. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు శనివారం ఆందోళనకు దిగారు. ఉదయ్‌భాస్కర్‌ని అరెస్టు చేసే వరకూ శవపరీక్ష నిర్వహించడానికి వీల్లేదంటూ నిరసన చేపట్టారు. పలు దఫాల చర్చల అనంతరం శనివారం అర్థరాత్రి సుబ్రహ్మణ్యం మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన పోలీసులు.. ఆదివారం ఉదయం అతని స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడకు తరలించారు. మృతదేహానికి కులవివక్ష పోరాట సంఘాల నేతలు, స్థానికులు నివాళులు అర్పించారు. తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. డ్రైవర్ మృతికి ఎమ్మెల్సీనే కారణమన్న కులవివక్ష పోరాట సంఘాల నేతలు.. అతడ్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్, మంత్రి వేణుగోపాలకృష్ణ, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి.. ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్ బినామీ అని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. అందుకే కళ్లముందే తిరుగుతున్నా పోలీసులు అతడిని పట్టుకోవడానికి సాహసించడం లేదన్నారు.