Yarramshetty Helping Hands: సొంతలాభం కొంతమానుకో పొరుగువారికి సాయపడవోయ్ అన్నారు మహాకవి గురజాడ. అన్ని దానాల్లోకల్లా అన్నదానం గొప్పది అంటారు పెద్దలు. అన్నార్తులకు ఆహారం అందించడం కంటే ఇంకేమి మహాభాగ్యం ఉంటుంది అంటారు యర్రంశెట్టి కృష్ణమూర్తి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇతని పేరు చాలా సుపరిచితం. ఆ పరిసరాల్లో రోడ్లపై ఉంటున్న అభాగ్యులను అడిగితే మావాడు అంటూ ఆత్మీయంగా చెబుతారు. యర్రంశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా తనకు ఉన్నంతలో అభాగ్యుల ఆకలి తీరుస్తూ వారికి ఆత్మబంధువు అయ్యారు.
Yarramsetty Helping Hands: తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువుకు చెందిన యర్రంశెట్టి కృష్ణమూర్తి. ఉపాధిహామీ పథకంలో క్షేత్రసహాయకుడిగా పనిచేస్తున్నారు. అన్నదానం కంటే గొప్పది ఏముంది అని నమ్మే ఆయన.. తనకు ఉన్నంతలో ఎదుటివారికి సాయపడాలనుకుంటారు. అయితే అన్నదానం ఖర్చుతో కూడుకున్నది. తన మనసులోని ఆలోచన కుటుంబ సభ్యులతో పంచుకోగా వారి నుంచి సానుకూల స్పందనతో పాటు చేయూత లభించడం వల్ల ఇంతమంచి కార్యక్రమం చేయగలగుతున్నాను అని కృష్ణమూర్తి తెలిపారు.
"ఆకలితో ఉన్న నోటికి అన్నం అందించడం కంటే ఈ సృష్టిలో గొప్ప విషయం ఏముంది. ఆర్థికంగా ఎంత ఎత్తు ఎదిగినా ఆకలితో ఉన్నవారికి ఓముద్ద అన్నం పెట్టనివాడు ఎప్పటికీ పేదవాడే. అందుకే నాకు ఉన్నంతలో అన్నార్థులకు ఆకలి తీర్చాలి అనుకున్నాను. పదోతరగతి చదువుతున్న సమయంలో నేను చూసిన ఓ ఘటన ఈ సేవా భావం వైపు మళ్లించింది. నా ఆలోచనలకు నా కుటుంబ సభ్యులు తోడవడం వల్ల యర్రంశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్కు పునాధిపడింది" యర్రంశెట్టి కృష్ణమూర్తి
కుటుంబసభ్యులు తోడు నిలవగా..:కొవిడ్ సమయంలో జాతీయ రహదారి వెంట నడిచి వెళ్లే వారికి ఆహారం అందించేవారు కృష్ణమూర్తి. తన జీతంతో పాటు ఉన్నకొద్దిపాటి ఆదాయ వనరులతో నిత్యం వారి ఇంటి వద్దనే వంటచేసి వాటిని పొట్లాలు కట్టి పంపిణీ చేసేవారు. కాలక్రమేణా ప్రతి శనివారం తమ ఇంటి వద్ద వంట చేసుకుని వాటిని పొట్లాలు కట్టి నగరంలో బైక్పై తిరుగుతూ ఎవరైతే అభాగ్యులు ఉంటారో వారి వద్దకే వెళ్లి ఆహారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తమవంతు చేయివేస్తారు. తన భర్త ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందినప్పటికంటే ఆకలి అన్నవారికి అన్నం అందించిననాడే చాలా సంతోషంగా కనిపిస్తారని కృష్ణమూర్తి భార్య ఆనందం వ్యక్తం చేసింది.