మండలి రద్దుపై యనమల విమర్శలు 3 రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు. శాసనసభలో మెజారిటీ ఉందని ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా బిల్లులు పెట్టారన్నారు. శాసనమండలి, శాసనసభకు సమాన హక్కులు ఉన్నాయన్న యనమల... శాసనమండలిలో తెదేపా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు. కాకినాడలో మాట్లాడిన ఆయన.. నిబంధనల ప్రకారం బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించామని తెలిపారు. మండలి రద్దు అంటూ రాజ్యాంగ విరుద్ధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రణాళిక లేకుండా విశాఖ అభివృద్ధి ఎలా..
ప్రజా వ్యతిరేక బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించామని యనమల తెలిపారు. సెలక్ట్ కమిటీకి పంపించడమంటే బిల్లును అడ్డుకోవడం కాదన్నారు. సీఎం జగన్ నిర్ణయాలతో భవిష్యత్తులో యువత నష్టపోతారని వ్యాఖ్యానించారు. పెట్టుబడులు రాకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయన్న ఆయన.. వైకాపా పాలనలో ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని ఆరోపించారు. ఇప్పటికే నాలుగు శాతానికి ఆదాయం పడిపోయిందన్నారు. రాజధానితో విశాఖ అభివృద్ధి జరుగుతుందని అంటున్న వైకాపా... కనీస ప్రణాళిక లేకుండా ఎలా అభివృద్ధి జరుగుతుందని ప్రశ్నించారు. మండలిలో వైకాపా సభ్యులు, మంత్రులు దారుణంగా మాట్లాడారని ఆరోపించారు.
ఇదీ చదవండి:
'రంగులు చెరిపేందుకు ఖర్చును జగన్ నుంచే వసూలు చేయాలి'