ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.. వారితోనే కుటుంబాల పురోగతి ఆధారపడి ఉంటుంది.. చైతన్యవంతమైన మహిళ కుటుంబ సభ్యులను ప్రగతి దిశగా నడిపిస్తుంది.. మరి ఆమె పాలనా పగ్గాలు చేపడితే.. అభివృద్ధికి దశా.. దిశా నిర్దేశిస్తుంది.. అలాంటి అవకాశం మరలా వచ్చింది.. తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతానికిపైగా రిజర్వేషన్లు కేటాయించారు. సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు వీరికి అగ్రపీఠం వేశారు.. కేటాయించిన స్థానాల్లో ఇప్పటికే మొదటి దశలో నామపత్రాలు దాఖలు చేయగా, రెండో విడతలో ఆ ప్రక్రియ కొనసాగుతోంది. మూడు, నాలుగో దశల్లోనూ వీరు పోటీలో నిలువనున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి..
పెద్దాపురం మండలం చదలాడ గ్రామం నుంచి వరుసగా మూడుసార్లు గ్రామ సర్పంచిగా రాగాల మాణిక్యాంబ ఎన్నికయ్యారు. 2001, 2006లో ఏకగ్రీవంగా, 2013లో పోటీచేసి విజయం సాధించారు. ప్రజల సహకారంతో సంపూర్ణ పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టారు. 2010లో నిర్మల్ పురస్కార్ అవార్డును, 2012-13లో జిల్లాస్థాయిలో స్వచ్ఛభారత్ అవార్డు సాధించారు. 2017-18లో స్వచ్ఛభారత్‌లో జాతీయ స్థాయిలో ఈ గ్రామం తొమ్మిదో స్థానం పొందింది. 2018లో జిల్లాలో ఉత్తమ పంచాయతీ అవార్డు సాధించింది. జన్మభూమి పథకం, ప్రజల భాగస్వామ్యంతో రహదారులు, ఇతర సౌకర్యాలు కల్పించారు. ఇరువై ఏళ్లు పదవీ కాలంలో సుమారు రూ. ఆరు కోట్లతో గ్రామాభివృద్ధి సాధించారు.
రెండు పర్యాయాల నుంచి 50 శాతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను 2006 నుంచి అమలు చేస్తున్నారు. 2006, 2013 ఎన్నికల్లో జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. 2006 సంవత్సరానికి ముందు మహిళలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉండేవి. మళ్లీ ఇప్పుడు 50 శాతంతో నిర్వహిస్తున్నారు. 2013 ఎన్నికల్లో 880 పంచాయతీల్లో 50 శాతం మహిళా సర్పంచులే ఏలారు. ఇప్పుడు మళ్లీ అలాంటి అవకాశం వచ్చింది.మేజరు పంచాయతీల్లో సత్తా.. జిల్లాలో 225 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో చాలాచోట్ల సర్పంచి స్థానాలను మహిళలకు కేటాయించారు. రూ.కోటికి పైగా ఆదాయమున్న పంచాయతీల్లో మహిళల చేతికి పగ్గాలు రానున్నాయి. కొత్తపేట, రావులపాలెం, ద్వారపూడి, గాడిమొగ, తాళ్లరేవు, కోరంగి, పల్లంకుర్రు, కందికుప్ప, బిక్కవోలు, అనపర్తి, ఇలా మేజరు పంచాయతీల్లో సైతం వనితలు సత్తా చాటనున్నారు. మేజరు పంచాయతీల్లో 50 శాతం వరకూ సర్పంచి స్థానాలు వారికి రిజర్వు అయ్యాయి. పోటీలో నిలవడం నుంచి గెలిచి పాలన పగ్గాలు చేపట్టి.. ఆయా పంచాయతీల ప్రగతిలో వీరు కీలక పాత్ర పోషించాలి.
అభివృద్ధే గీటురాయిగా..