ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోట్లు కుమ్మరించిన దరిచేరని జలాలు... చెంతనే ప్రాజెక్టులున్నా తప్పని ఎదురుచూపులు

గలగలా గోదారి పొంగి పొర్లుతోంది.. బిరబిరమని సాగరంలో కలిసిపోతోంది.. ఆ జలాలు ఒడిసి పట్టాలి.. ప్రాజెక్టుల్లో పదిలపరచాలి.. సాగు నీటిని కాలువల ద్వారా సమర్థంగా పంటలకు అందించాలి.. అప్పుడే పంట చేలు పండేది.. రైతు ఇంట సిరులు కురిసేది.. ఈ ఉద్దేశంతోనే సాగునీటి వనరుల అభివృద్ధికి సర్కారు రూ.కోట్లు కుమ్మరిస్తోంది. ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు, భూసేకరణ, ఇతర పనుల్లో జాప్యంతో లక్ష్య సాధన నెమ్మదించింది. పుష్కలంగా నీటి వనరులున్న తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని కాలాల్లో విపత్తులతో పంటలకు జల గండం.. మరికొన్ని కాలాల్లో శివారుకు సాగునీరు చేరని దయనీయం. ఈ పరిస్థితిని చక్కదిద్దేలా ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంది.

water projects in east godavari district
చెంతనే ప్రాజెక్టులున్నా తప్పని ఎదురుచూపులు

By

Published : Dec 4, 2020, 7:31 PM IST

గోకవరం మండలం వెదురుపాక వద్ద పోలవరం ఎడమ కాలువ

సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు కుమ్మరిస్తోంది. ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు, భూసేకరణ, ఇతర పనుల్లో జాప్యంతో లక్ష్య సాధన నెమ్మదించింది. పుష్కలంగా నీటి వనరులున్న తూర్పుగోదావరి జిల్లాలో... కొన్ని కాలాల్లో విపత్తులతో పంటలకు జల గండం.. మరికొన్ని కాలాల్లో శివారుకు సాగునీరు చేరని దయనీయ పరిస్థితులు కనబడుతున్నాయి.

వీడని కలవరం...

పథకం: పోలవరం ఎడమ ప్రధాన కాలువ

లక్ష్యం: దేవీపట్నం మండలం నేలకోట వద్ద గోదావరిపై ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు, విశాఖలో 1.5 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. విశాఖలో కాలువ పరిసరాల్లో 358 గ్రామాలకు తాగునీరు, పరిశ్రమలకు 23 టీఎంసీలు ఇవ్వాలి.

సమస్య: గండికోటలో పునరావాసం పూర్తయినా, కుమ్మరిలోవలో పూర్తికాలేదు. 171 కి.మీ మట్టి పనులు, 129 కి.మీ లైనింగ్‌, 165 నిర్మాణాలు పూర్తయ్యాయి. 105 పనులు నిర్మాణంలో ఉంటే.. 131 కట్టడాలు ప్రారంభించాలి.

పరిష్కారం: డిసెంబరు 2021 నాటికి నిర్మాణాలు, ఇతర ప్రక్రియలు పూర్తిచేయాలనేది లక్ష్యమని ఎల్‌ఎంసీ ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్‌ చెప్పారు. కొన్ని పనులు కొత్త ఏజెన్సీకి అప్పగించారు.

జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామం వద్ద పుష్కర జలాలు పారని పిల్ల కాలువ

శివారు భూములకు గగనమే..

పథకం: పుష్కర ఎత్తిపోతల

లక్ష్యం: సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద ఉన్న పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా 18 మండలాలకు, విశాఖలో 163 గ్రామాల్లోని 1.85 లక్షల ఎకరాలకు ఖరీఫ్‌కు సాగునీరు.

సమస్య: పిల్ల కాలువలు సవ్యంగా లేక నీరు పారడంలేదు. గండేపల్లి మండలం తాళ్లూరులో పంపు హౌస్‌ నిర్మించినా.. పూర్తిసేవలు దరి చేరక శివారుకు నీరు దక్కని వైనం. ఖరీఫ్‌లో 1.48 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాలని ప్రతిపాదన. రబీకి నీరు అందించడంలేదు. మైనర్‌, సబ్‌ మైనర్స్‌ లైనింగ్‌, మరమ్మతులు చేయాలి. ఈ పనులు జరిగితేనే లక్ష్యం మేరకు సాగునీరు అందేది.

పరిష్కారం: లైనింగ్‌, మరమ్మతులతో సమస్య అధిగమిస్తామని ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్‌ చెప్పారు.

కాతేరు వద్ద వెంకటనగరం పంపింగ్‌ స్కీం

సాగునీరు అరకొరే..

ముసురుమిల్లి జలాశయం

లక్ష్యం: ముసురుమిల్లి దగ్గర సీతపల్లి వాగుపై జలాశయం నిర్మించారు. రంపచోడవరం, దేవీపట్నం, గంగవరం మండలాల్లో 22,136 ఎకరాలకు, గోకవరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో ఆరు మెట్ట ప్రాంతాలకు సాగునీరు ఇవ్వడం.

సమస్య: హెడ్‌ వర్క్స్‌ పనులు, రేడియల్‌ గేట్ల అమరిక పూర్తయింది. శ్లాబు ఇతర పనులు కావాలి. దీంతో నీరు క్రస్ట్‌ స్థాయికి మాత్రమే నిల్వ చేస్తున్నారు. కేవలం ఎనిమిది వేల ఎకరాల ఆరుతడికే నీరిస్తున్నారు. మైనర్‌, సబ్‌ మైనర్‌ లైనింగ్‌, మరమ్మతులు చేయాలి.

పరిష్కారం: హెడ్‌వర్స్క్‌ పనులు, గేట్ల ఏర్పాటుతో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తిచేసి ముసురుమిల్లి జలాశయం ద్వారా పూర్తిస్థాయిలో సాగునీరిస్తామని ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్‌ చెప్పారు.

హెడ్‌వర్క్స్‌ పనులు ఇలా

భూసేకరణ ఎప్పుడో..?

వెంకటనగరం పంపింగ్‌ స్కీం

లక్ష్యం: రాజమహేంద్రవరం గ్రామీణంలోని కాతేరు వద్ద గోదావరి ఎడమ గట్టున ప్రతిపాదించారు. 34 వేల ఎకరాలకు

3.62 టీఎంసీలు ఎత్తిపోతల ద్వారా ఇవ్వాలనీ, 1.28 లక్షల మందికి తాగునీరి ఇవ్వాలనేది సంకల్పం.

సమస్య: తొలిగా 2009లో 2,250 ఎకరాలకు సాగునీరు అందించారు. రైతుల అభ్యంతరాలు, ఇతర కారణాలతో ఇంకా

366.96 ఎకరాల భూసేకరణ చేయాలి. రైతుల అభ్యంతరాలతో డిస్ట్రిబ్యూటరీ పనుల్లో కదలిక రాలేదు. ఈ ఖరీఫ్‌లో ఈ ప్రాజెక్టు ద్వారా 10,641 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించారు.

పరిష్కారం: భూసేకరణ ప్రక్రియ వేగవంతంపై దృష్టిసారించామని ధవళేశ్వరం జలవనరుల శాఖ ఎస్‌ఈ శ్రీరామకృష్ణ చెప్పారు.

నీటి నిల్వలు ఏవీ?

సూరంపాలెం జలాశయం

లక్ష్యం: గంగవరం మండలంలోని తొర్రిగెడ్డ ఉపనది బురద కాలువపై జలాశయం నిర్మించారు. గంగవరం, గోకవరం, కోరుకొండ మండలాల్లో 11,493 ఎకరాలకు సాగునీరే లక్ష్యం.

సమస్య: మొత్తం ఆయకట్టుకు నీరు ఇవ్వాలంటే ప్రాజెక్టును మూడున్నర సార్లు నిండాలి. దీంతో ఈ ప్రాజెక్టులో తగిన నీటి నిల్వలు లేక రబీకి ఇవ్వలేకున్నారు. ప్రస్తుతం 9,825 ఎకరాలకే ఇస్తున్నారు. శివారున కోరుకొండ మండలంలోని మందరాడ, గాదరాడ పరిసరాల్లో కాలువలు పూడి నీరందడంలేదు.

పరిష్కారం: వర్షాధార ప్రాజెక్టు కావడంతో ఖరీఫ్‌కు మాత్రమే నీరిస్తున్నామని డీఈ రమేష్‌ చెప్పారు. వార్షిక మరమ్మతుల్లో పూడిక తొలగించి పూర్తిగా నీరిస్తామన్నారు.

సూరంపాలెం జలాశయం నుంచి విడుదలవుతున్న జలాలు

రబీలో 4వేల ఎకరాలకే

భూపతిపాలెం జలాశయం

లక్ష్యం: రంపచోడవరం మండలం భూపతిపాలెం వద్ద గోదావరి ఉపనది సీతపల్లి వాగు దగ్గర నిర్మించారు. రంపచోడవరం మండలంలో 19, గంగవరం మండలంలో 13 గ్రామాలకు 11,526 ఎకరాలకు నీరివ్వాలి.

సమస్య: ఖరీఫ్‌లో మొత్తం ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించినా... తగిన నీటి నిల్వలు లేక రబీలో పంటలకు 4 వేల ఎకరాలకే ఇస్తున్నారు. కాలువల్లో పూడికతో గంగవరం మండలానికి సాగునీరు అందడం లేదు.

పరిష్కారం: కాలువల్లో పూడిక తొలగించి పూర్తిస్థాయిలో ఖరీఫ్‌కు సాగునీరిస్తామని డీఈ మాధవరావు చెప్పారు.

భూపతిపాలెం జలాశయం

12 ఏళ్లుగా చుక్క నీరందలేదు

పుష్కర ఎత్తిపోతల పథకం ప్రారంభమై 12 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ మా గ్రామానికి చుక్కనీరు రాలేదు. ప్రతి ఏడాదీ తొలకరిలో ఆశ చావక నాట్లు వేస్తాం. సాగునీరు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి. కాలువలు సక్రమంగా లేక పుష్కర జలాలు పొలాలకు చేరడంలేదు. అందుకే రైతులు నష్టపోవాల్సి వస్తోంది. మూసుకుపోయిన పిల్ల కాలువలు బాగుచేసి నీరు పారేలా చేస్తే మాకు న్యాయం జరుగుతుంది.

- బండారు చిన్నయ్య, రైతు, మరిపాక, జగ్గంపేట

ఇదీ చదవండి:

రైతన్నపై రాజకీయం... పంట నమోదులో పెత్తనం

ABOUT THE AUTHOR

...view details