LABOURERS PROTEST: రాష్ట్రంలోని సమగ్ర రక్షిత తాగునీటి పథకాల (సీపీడబ్ల్యూఎస్) నిర్వహణకు నిధుల విడుదలలో జాప్యం కారణంగా వీటిలో పని చేసే కార్మికులు అనేక నెలలుగా జీతాలకు నోచుకోవడం లేదు. దీంతో వీరు విధులను బహిష్కరిస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాలకు నీటి సరఫరాపై ప్రభావం చూపుతోంది. అనంతపురం జిల్లా సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాల కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికులు విధుల్లోకి రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా 480 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఉభయ గోదావరి, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోనూ అనేక చోట్ల జీతాల చెల్లింపుల్లో జాప్యంతో కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
సమస్య ఎక్కడ..ఎందుకు?
రాష్ట్రంలో 560 సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) ఉన్నాయి. ఒక్కో పథకం పరిధిలో రోజూ 80 నుంచి 130 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తుంటారు. అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి నిర్వహణకు నిధులను జిల్లా పరిషత్తులు (జడ్పీ) సమకూరుస్తాయి. సాంకేతిక సహాయాన్ని పంచాయతీరాజ్ గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లు అందిస్తుంటారు. పథకాల నిర్వహణను మొదటి నుంచి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. పంపింగ్ నుంచి నీటి సరఫరా వరకు వీరే బాధ్యత తీసుకుంటారు. ఇందుకు సంబంధించి పలు జిల్లాల్లో 6 నుంచి 12 నెలల నిర్వహణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ప్రైవేట్ ఏజెన్సీలు తమ వద్ద పని చేస్తున్న కార్మికులకు జీతాలు బకాయిపడ్డాయి. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో చందవరం-2 సమగ్ర రక్షిత తాగు నీటి పథకంలో పని చేస్తున్న సిబ్బందికి పది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఇటీవల ఆందోళనకు దిగి పంపింగ్ నిలిపివేశారు. దీంతో 126 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. 2020 మార్చి నుంచి ప్రైవేట్ సంస్థకు సుమారు రూ.2.50 కోట్ల బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇంజినీర్లు గట్టిగా ఒత్తిడి తేవడంతో సంస్థ నిర్వాహకులు తమ సొంత నిధులతో ఐదు నెలల జీతాల బకాయిలు చెల్లించడంతో కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యారు.