ఇప్పుడంటే ఆధునిక మారణాయుధాల వాడకం పెరిగింది కానీ... ఒకప్పుడు కర్రసాము తెలిస్తే అదే గొప్ప. కర్ర తిప్పితే..ఎంతటి మెునగాడైనా..భయపడాల్సిందే. ఆత్మరక్షణతోపాటు ఆరోగ్యాన్ని అందించే...ఈ ప్రాచీన విద్య కనుమరుగవుతోంది. ఆ కళ కాపాడుకోవాలనే తపనే పతకాల పంట పండిస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలోని వేళంగి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు కర్రసాములో మేటి. నిరంతర సాధనతో సంప్రదాయ క్రీడలో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. ఆర్ఎంఎస్ఏలో భాగంగా వ్యాయామ ఉపాధ్యాయురాలు చాందినీ శిరీష చొరవతో 40మందికి కర్రసాము నేర్పిస్తున్నారు. ఆరు నెలల నుంచి క్రమం తప్పకుండా శిక్షకుడు లోవరాజు తర్ఫీదునిస్తున్నారు. తక్కువ సమయంలోనే విద్యార్థులు కర్రసాములో మెళకువలు నేర్చుకుని అద్భుతంగా రాణిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని 5 పసిడి, 4 వెండి పతకాలు దక్కించుకున్నారు. తమిళనాడులో జరిగిన 11వ జాతీయ స్థాయి పోటీల్లో ఓ వెండి పతకం, కాంస్య పతకం సాధించారు.