ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళతప్పిన ఉప్పాడ జాంధాని.. మూగబోయిన నేతన్న మగ్గం

ఉప్పాడ చేనేతకు కరోనా కష్టాలు తెచ్చింది. లాక్​డౌన్​ సడలింపులతో 65 రోజుల తర్వాత దుకాణాలు తెరిచినా కొనుగోలు చేసే నాథుడే కనిపించడంలేదు. దుకాణాల మూసివేతతో వందల సంఖ్యలో చేనేత కార్మికులకు ఉపాధి కరవైంది. మహిళల రాజసానికి ప్రతీకగా కట్టుకునే జాంధాని చీర.. నేతన్న కష్టాలు తీర్చలేకపోతోంది.

కళతప్పిన ఉప్పాడ జాంధాని.. మూగబోయిన నేతన్న మగ్గం
కళతప్పిన ఉప్పాడ జాంధాని.. మూగబోయిన నేతన్న మగ్గం

By

Published : Jun 7, 2020, 3:35 PM IST

కళతప్పిన ఉప్పాడ జాంధాని.. మూగబోయిన నేతన్న మగ్గం

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ అనగానే మహిళల మదిలో మెదిలేది కళాత్మకమైన జాంధాని చీరలు. ఈ చీరలకు ఉండే గిరాకీతో నేతన్నలు వీటి తయారీకి అంతే శ్రద్ధ చూపేవారు. వినియోగదారులతో సందడిగా ఉండే ఉప్పాడ చేనేత వస్త్రాలయాలు ప్రస్తుతం బోసిపోతున్నాయి. లాక్​డౌన్​ వల్ల రెండు నెలలకు పైగా దుకాణాలన్నీ మూతపడే ఉన్నాయి. లాక్​డౌన్​ సడలింపులతో.. పదిరోజుల నుంచి ఒక్కొక్క దుకాణం తెరుచుకుంటుంది.

దుకాణాలు తెరిచినా కొనేవారు మాత్రం కనిపించడంలేదు. ఉప్పాడ చీరలను తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై నుంచి వచ్చి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం వ్యాపారులు ఎవరూ కొనుగోలు చేయటంలేదు. లాక్‌డౌన్‌ వల్ల రూ.80 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినట్లు దుకాణదారులు చెబుతున్నారు.

చేనేత కార్మికుల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. ఏడాది పొడవునా మగ్గంపై కళాత్మకమైన చీరలు నేసే కార్మికులు ప్రస్తుతం పడుగు పక్కన పెట్టేశారు. మగ్గంపై అరకొర చీరలు నేస్తున్నా వ్యాపారులు తీసుకెళ్లని పరిస్థితి. ఒక్కో చీర తయారుచేయాలంటే కనీసం నెలరోజులు పడుతుంది. దంపతులు ఇద్దరూ నిత్యం మగ్గంపై పనిచేస్తేనే నాణ్యమైన చీరలు తయారవుతాయి. నేసిన చీరలు నేతన్న ఇళ్లల్లోనే మగ్గిపోతున్నాయి. వ్యాపారులెవరూ ఆర్డర్లు ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

రెండు నెలలకు పైగా దుకాణాలు తెరవక పోవడంతో జాంధాని, చందేరి ఇతర చీరల నాణ్యతలోనూ తేడాలొస్తున్నాయి. కొంతమంది దుకాణదారులు వాటి నాణ్యత దెబ్బతినకుండా మెరుగులు దిద్దుతున్నారు. యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, వాకతిప్ప, మూలపేట, అమీనాబాద్ తదితర గ్రామాల్లోని సుమారు 1500 మంది పైగా నేత కార్మికులు, ఆ రంగంపై ఆధారపడి ఉపాధి పెందుతున్నారు. కరోనా వీరి ఆదాయానికి గండి కొట్టింది.

ప్రస్తుతం దుకాణాలు తెరిచినా పెళ్లిల్లు, శుభకార్యాలు సీజన్‌ ముగిసింది. వర్షాకాలం ప్రారంభమైన వేళ కొనుగోళ్లు నామ మాత్రంగా ఉంటాయని కార్మికులు అంటున్నారు. లాక్​డౌన్​తో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి :అధికారుల వైఫల్యం.. రైతుల పాలిట శాపం

ABOUT THE AUTHOR

...view details