పట్టణాలను పరిశుభ్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలకు ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కేటాయించిన వివిధ రకాల వాహనాలు పలుచోట్ల మూలన పడి ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణలో యాంత్రీకరణకు ప్రాధాన్యమిస్తూ ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలో దాదాపు రూ.300 కోట్లు వెచ్చించాయి. 600 వాహనాలు కొనుగోలు చేశాయి.
నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలకు వీటిని కేటాయించే సందర్భంలో వినియోగంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించని కారణంగా పలుచోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. నిపుణులైన డ్రైవర్ల కొరత, అధిక డీజిల్ వాడకం, మరమ్మతులు చేసే వారు లేని కారణంగా కొన్నిచోట్ల మూలనపడ్డాయి. మినీ, భారీ స్వీపింగ్ వాహనాలు, కాంపక్టర్లు పలుచోట్ల వినియోగించడం లేదు. డీజిల్ ఖర్చు ఎక్కువగా ఉందని అనంతపురం, ప్రకాశం, ఉభయ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు పట్టణాల్లో వాహనాలను పక్కన పెట్టారు.