murder: కోపంగా చూశాడని ప్రాణం తీశారు - తూర్పుగోదావరి జిల్లా నేర వార్తలు
16:41 July 29
మద్యం తాగి బీరు సీసాలతో పొడుచుకున్న ఇద్దరు వ్యక్తులు
పూటుగా మద్యం తాగిన ఐదుగురు వ్యక్తులు ఎలాంటి బలమైన కారణం లేకుండానే మరో ఇద్దరిపై దాడి చేసి ఒకరిని హత్య చేశారు. ఈ ఘటన యానాంలో గురువారం జరిగింది. రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిసర ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు యానాం వచ్చారు. బైపాస్ రోడ్డులో మద్యం దుకాణంలో తాగి బయటకు వస్తున్న సమయంలో బిల్లు కౌంటర్ వద్ద ఐ.పోలవరం మండలం పెదమడి గ్రామానికి చెందిన గ్రామ వాలంటీరు లంక రాజబాబు (25), కాశి శ్రీనివాసరావు బిల్లు చెల్లిస్తున్నారు. ఆ సమయంలో రాజబాబు తమ పక్కనున్న ఐదుగురి వంక కోపంగా చూశాడంటూ.. వారిద్దరితో గొడవపడ్డారు. ఐదుగురిలో ఒకరు తన వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో రాజబాబు అక్కడికక్కడే ప్రాణం విడిచాడు. కత్తిపోట్లకు కాశి శ్రీనివాసరావు పొట్ట చీరుకుపోయింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. వారి కోసం మూడు బృందాలతో గాలిస్తున్నట్లు సీఐ అరివు సెల్వం తెలిపారు. తీవ్రంగా గాయపడిన కాశి శ్రీనివాసరావును కాకినాడ తరలించారు.
రాజబాబు అవివాహితుడని, తల్లి ఇతర ప్రాంతాల్లో ఉంటోందని సమీప బంధువు తెలిపాడు. మద్యం తాగే అలవాటు లేదని, బిర్యానీ తినడానికి వెళ్లి ఇలా దుర్మరణం పాలయ్యాడంటూ విలపించాడు. ఈ ఘటనకు సంబంధించి రాజోలుకు చెందిన కేదగిరి మణికంఠ, చింతా సత్యనారాయణలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పంపన చిన్నా (రాజోలు), రోహిత్ (తాళ్లపూడి), పాతూరి థియోఫిలస్ (కొవ్వూరు) కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:Tokyo Olympics: ప్రీక్వార్టర్స్‌లో మేరీకోమ్ ఓటమి