తూర్పుగోదావరి జిల్లాలో శనివారం ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు కొత్తగా రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. సామర్లకోటలోని కోలావారివీధిలో 37 ఏళ్ల మహిళ, 18 ఏళ్ల ఆమె కుమార్తెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంతకు ముందు రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా వెలుగు చూసిన రెండు కేసులతో కలిపి నలుగురూ ఒకే కుటుంబంలోని సభ్యులని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కు చేరింది.
జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. 15 కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో ప్రత్యేక దృష్టిసారించారు. అన్ని కంటైన్మెంట్ జోన్ల పరిధిలో బృందాలు సర్వే నిర్వహించి, ప్రజల ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు తయారు చేస్తున్నాయి. సామర్లకోటలో తాజాగా కరోనా వెలుగు చూసిన ఇద్దరిని శనివారం అర్ధరాత్రి తరువాత రాజానగరంలోని జీఎస్‌ఎల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. సేకరించిన నమూనాల్లో వెయ్యి మంది ఫలితాలు వెలువడాల్సి ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వైలెన్స్ అధికారి డాక్టర్ మల్లికార్జున్ తెలిపారు.
క్వారంటైన్లో 452 మంది
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో మొత్తం 452 మంది ఉన్నట్లు డీఆర్వో సత్తిబాబు తెలిపారు. క్వారంటైన్ కేంద్రాల నుంచి 110 మందిని ఆదివారం ఇళ్లకు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం బొమ్మూరు క్వారంటైన్లో 131 మంది, కాకినాడ జేఎన్టీయూలో 157 మంది, అన్నవరంలో 73 మంది, సామర్లకోటలో 68 మంది, కాకినాడ జీజీహెచ్‌లో ఏడుగురు, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో 14 మంది, అమలాపురంలో ఇద్దరు చొప్పున ఉన్నట్లు తెలిపారు.
మదన్‌సింగ్‌పేటవాసుల ఆవేదన
రాజమహేంద్రవరం జెండాపంజా రోడ్ కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న మదన్‌సింగ్‌పేటలో ఆదివారం అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి సౌకర్యాలు అందటం లేదని.. ఉదయం 6 నుంచి 9 గంటల సమయంలో అందర్నీ బయటకు పంపిస్తున్నట్లే తమనూ పంపాలని విన్నవించారు. రెండు రోజుల నుంచి తినడానికి తిండి, తాగటానికి నీళ్లు లేవని ఆవేదన చెందారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్‌కిషోర్ దృష్టికి తీసుకెళ్లగా ఆ ప్రాంతానికి రోజూ 3 మొబైల్ రైతు బజార్లు, 3 పాల వ్యాన్లు, ఒక పండ్ల వ్యాన్‌ను పంపిస్తున్నామని, తాగునీరు సమృద్ధిగా అందజేస్తున్నామని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో ఉండే ప్రజలకు సీఎస్‌ఆర్ నిధులను ఖర్చుచేసి నిత్యావసరాలు పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.