ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్ల ముందే ఇద్దరు కుమారులు మృతి.. గుండెలవిసేలా తల్లిదండ్రుల రోదన - తూర్పుగోదావర జిల్లా తుని రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

కూలి పని చేసే ఆ తండ్రి ఆదివారం రోజైనా పిల్లలతో సరదాగా గడుపుదామనుకోవడమే పాపమైంది. నానమ్మ ఇంటి నుంచి పిల్లలను తీసుకొని సంతోషంగా బయలుదేరిన వారిని.. భారీ వాహనం రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ దుర్ఘటనలో అభం శుభం తెలియని ఇద్దరు బాలురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన కలచివేసింది.

two children killed in road accident occured at tuni in east godavari
తుని రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు బాలురు

By

Published : Dec 20, 2020, 10:33 PM IST

తుని రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు బాలురు

తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన రోడ్డు ప్రమాదం అందరిని కన్నీరు పెట్టించింది. చేతికి అందివచ్చాడనుకున్న కుమారుడు.. అల్లారు ముద్దుగా పెంచుకున్న మరో కొడుకు ఇద్దరూ కళ్లముందే ముందే మృత్యు ఒడికి చేరడం ఆ తల్లిదండ్రులను విషాదంలో ముంచేసింది. విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన వేణు, లక్ష్మి దంపతులు.. తునికి సమీపంలో ఇటుక బట్టీల్లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు దుర్గాప్రసాద్, తాతాజీలను.. స్వగ్రామమైన కోటవురట్లలో నాన్నమ్మ దగ్గరే ఉంచి చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఇంటర్ చదువుతుండగా.. రెండో కుమారుడు తాతాజీ రెండో తరగతి చదువుతున్నాడు. పిల్లలను చూడాలన్న ఆశతో శనివారం సొంతూరు వెళ్లిన తండ్రి వేణు.. ఆదివారం ఉదయాన్నే పిల్లలను తీసుకొని ద్విచక్రవాహనంపై తుని బయలుదేరాడు. మరో 2 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వారు కూలి పని చేసుకునే ప్రదేశానికి చేరుకోవచ్చు. కానీ ఈలోగా ఓ భారీ వాహనం మృత్యువు రూపంలో వారిని వెంటాడింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న తండ్రి కుమారులను ఢీకొట్టింది. ఏం జరిగిందో తెలిసేలోపే బాలురు లారీ చక్రాల కింద పడి నలిగిపోగా.. మరోవైపున పడ్డ తండ్రి జీవచ్ఛవంలా మిగిలిపోయాడు.

సమాచారం అందుకున్న తల్లి పరుగున వచ్చి తన పిల్లల మృతదేహాల వద్ద రోధించింది. ఈ దృశ్యాలు అందరిని కలచివేశాయి. బిడ్డల జీవితాలను చక్కగా.. ఏ లోటు లేకుండా తీర్చిదిద్దాలని ఆశపడ్డ తమ ఆశలు అడియాశలయ్యాయని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాలను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఆ తల్లి.. దాని వెనుక పరిగెత్తే ప్రయత్నం చేయడం.. అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. పంచనామా తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details