మహిళలపై రోజురోజుకీ పెరుగుతున్న అకృత్యాలకు సమాధానమే ఆత్మరక్షణ. వేధింపులకు గురవుతున్న, వెకిలి చేష్టలకు బలవుతున్న అమ్మాయిలకు అదే ఆయుధం. వారు తలచుకుంటే ఆత్మ స్థైర్థ్యాన్ని.. ఆత్మరక్షణగా మలుచుకోవడంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చు. ఇది మాటలకు మాత్రమే పరిమితం కాదని.. తూర్పు గోదావరి జిల్లా అమ్మాయిలు నిరూపిస్తున్నారు. జిల్లాలోని దాదాపు 540 పాఠశాలల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష కార్యక్రమంతో.. ఆత్మరక్షణలో రాటుదేలుతున్నారు.
బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ పేరిట ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. నిష్ణాతులైన శిక్షకులతో తైక్వాండో, కరాటే, కర్ర సాములాంటి అంశాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో 30 రోజుల పాటు బోధిస్తున్నారు. ఆకతాయిలు ఇబ్బంది పెట్టే సమయంలో వారిని దీటుగా ఎదుర్కొనేందుకు బాలికలకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతోంది. ఇలాంటి కార్యక్రమాలతో అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.