గోదావరిలో సుడిగుండమే బోటు పాలిట యమగండంగా మారింది. ఆ సుడిగుండంలో చిక్కుకునే బోటు కొంత వెనక్కి ప్రయాణించి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లాంచీ యజమాని ఇదే విషయం చెబుతున్నారు. జలవనరులశాఖ అధికారులు కూడా సుడిగుండాలు పెరిగాయని విశ్లేషిస్తున్నారు. కచ్చులూరు వద్ద సుడిగుండాలు తరచూ సంభవిస్తుంటాయి. పాపికొండల ప్రయాణం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వరకు జలమార్గంలోనే ప్రయాణిస్తున్న వారు ఎందరో. ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా ఉండటంతో పర్యాటకం విస్తృతమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పోశమ్మ గండి నుంచి పాపికొండల వరకు 62 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రమాద పరిస్థితులను తెలియజేస్తూ హెచ్చరిక సూచికలు లేవు. దీంతో కొన్ని విహార యాత్రలు విషాద యాత్రలుగా మిగిలిపోతున్నాయి.
ప్రవాహానికి ఎదురీత
రాజమహేంద్రవరం, పట్టిసీమ, సింగనపల్లి, పోశమ్మగండి నుంచి పాపికొండలకు ప్రయాణించే సమయంలో ప్రవాహానికి ఎదురీదాల్సి ఉంటుంది. ముందుకు వెళ్లే కొద్దీ కొండల నడుమ గోదావరి సన్నగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎన్నో మలుపులు ఉంటాయి. ఇటీవల ఉద్ధృతంగా వరద వచ్చింది. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవరూ పరిశీలించిందీ లేదు. ఆ 62 కిలోమీటర్ల ప్రయాణంలో ఎక్కడా జనసంచారం ఉండదు. పడవలు, లాంచీలే తప్ప పరిసర ప్రాంతాల్లో ఎవరూ కనిపించరు. ప్రధానంగా కచ్చులూరు వద్ద నదీ ప్రవాహానికి కొండ అడ్డుగా ఉండటంతో సుడిగుండాలు ఎక్కువగా ఉంటాయి. సుడిగుండంలో చిక్కుకున్న వెంటనే లాంచీలు పెద్దపెద్ద బండరాళ్లను ఢీకొని, బోల్తా పడడం లేదా రంధ్రం ఏర్పడి లోపలికి నీరు ప్రవేశించడం వంటి వాటికి ఆస్కారం ఏర్పడుతోందని చెబుతున్నారు. ఆదివారం కూడా కచ్చులూరు వద్ద గోదావరి ప్రవాహ వడి, సుడి కలిసి ప్రమాదానికి దారి తీశాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నీటి సుడుల్లో బోటు, లాంచీ చిక్కుకుంటే బయటపడడం అసాధ్యమని జలవనరులశాఖ నిపుణులు చెబుతున్నారు.