అమెరికాలాంటి దేశాల్లో సంభవించే టోర్నడోలను తలపించేలా యానాంలోని తీరగ్రామాల వద్ద సుడిగాలి భీభత్సం సృష్టించింది. ఫరంపేట చేరువలోని గోదావరి లంకభూముల్లో మొదలైన సుడిగాలి అయ్యన్ననగర్ వద్దకు వచ్చేసరికి ఉద్ధృతమైంది. దీని తీవ్రతకు స్థానిక రొయ్యలచెరువుల్లోని నీరు నింగి వైపు ఎగసింది.
రొయ్యల చెరువుల్లోని 25 కిలోల బరువుండే రేడియేటర్లు, మోటార్లు గాలిలోకి దాదాపు వంద మీటర్ల ఎత్తుకు వెళ్లి నేలపై పడి ధ్వంసమయ్యాయి. రేకులషెడ్లు, చెట్లు నేలకూలాయి. అయ్యన్ననగర్, ఫరంపేట, నీలపల్లి, వైఎస్‌ఆర్‌కాలనీ తదితర ప్రాంతాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. సుడిగాలి తీవ్రతకు చెరువులోకాసేపు నిప్పులు కనిపించటంతో అంతా అందోళన చెందారు. దాదాపు 20 నిమిషాల పాటు ఉన్న సుడిగాలి రొయ్యలు చెరువులుపై ఎనిమిదిన్నర నిమిషాలపాటు ఉంది. ఈ ఉపద్రవంతో రూ.25 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని స్థానిక అధికారులు అంచనా వేశారు. సుడిగాలి అనంతరం కురిసన భారీవర్షానికి ఆకాశం నుంచి రొయ్యలు పడినట్లు స్థానికులు తెలిపారు.