ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసింది.. ఆలయ పూజారే!'

రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం ధ్వంసం ఘటనలో ముగ్గురు నిందితులు అరెస్టు అయ్యారు. ఈ మేరకు వివరాలను సిట్ డీఐజీ అశోక్ కుమార్ మీడియాకు వివరించారు.

SIT DIG Ashok Kumar
సిట్ డీఐజీ అశోక్ కుమార్

By

Published : Jan 31, 2021, 8:19 PM IST

Updated : Feb 1, 2021, 7:17 AM IST

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీరామ్‌నగర్‌ విఘ్నేశ్వరాలయంలో సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయ పూజారే ధ్వంసం చేశారని విజయవాడ సిట్‌ విభాగం డీఐజీ అశోక్‌ కుమార్ వెల్లడించారు. రాజమహేంద్రవరం దిశ మహిళ పోలీసు స్టేషన్‌లో కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు ఆయన వెల్లడించారు. జనవరి 1వ తేదీన జరిగిన ఈ ఘటనపై అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేయగా, తమ సిట్‌ విభాగంతో కలిపి మొత్తం 8 బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సిట్‌ విభాగం అనేక కోణాల్లో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని లోతుగా విచారించిందన్నారు. ఆలయ పూజారి మరల వెంకట మురళీకృష్ణతో పాటు మల్ల వెంకటరాజు, దంతులూరి వెంకటపతి రాజు అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

‘‘ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న వెంకటమురళికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ఆసరాగా చేసుకొని కొంతమంది రూ.30 వేల నగదు ఆశ చూపి అతడి చేత స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయించారు. రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే కొంత మంది వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చాం’’ అని డీఐజీ స్పష్టం చేశారు. కేసు విచారణ ఇక్కడితో పూర్తి కాలేదని తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని డీఐజీ తెలిపారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో జరిగిన వివిధ కేసుల విచారణను కూడా వెల్లడిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ షిమోషి బాజ్‌పాయీ, ఏఎస్పీ లతామాధురి తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Feb 1, 2021, 7:17 AM IST

ABOUT THE AUTHOR

...view details