తూర్పు గోదావరి జిల్లాలో...
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. మృతుడు పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన అక్కిరెడ్డి రాజుగా గుర్తించినట్లు వివరించారు. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న అక్కిరెడ్డి రాజు ఆలమూరు మండలం మడికికి ఓ పని మీద వచ్చినట్లు తెలిపారు. అర్ధరాత్రి జాతీయ రహదారి పక్క నడుస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టటంతో అక్కిరెడ్డి రాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
విశాఖ జిల్లాలో...
విశాఖ జిల్లా నర్సీపట్నంలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యాపారి మృతి చెందాడు. నర్సీపట్నంలోని సిటీ ఎంపోరియం అనే వ్యాపార సంస్థ యజమాని అయిన సూరి శెట్టి శ్రీనివాసరావు.. గొలుగొండ మండలం ఎల్లాపురంలోని ఓ శుభకార్యానికి వెళ్లి, ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నారు. నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వచ్చేసరికి సూరి శెట్టి శ్రీనివాసరావు వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసరావుని ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖకు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా మృతుడు శ్రీనివాసరావు మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు అపహరణకు గురైందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లా నాతవరం మండలం శృంగవరం వద్ద మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. రావికమతం మండలం అర్జాపురం గ్రామం నుంచి తలుపులమ్మతల్లి లోవ దర్శనానికి ఆటోలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులు బయలుదేరారు. శృంగవరం వద్దకు వచ్చేసరికి తుని నుంచి నర్సీపట్నం వైపు ఆటో, స్కూటీ ఒకేసారి వస్తుండటంతో.. ఆటో స్కూటీని ఢీకొట్టింది. ఈ రెండు వాహనాలు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రావికమతంకు చెందిన ఆటోను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో తలుపులమ్మ లోవ దర్శనానికి వెళ్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడగా, స్కూటీ మీద వస్తున్న నాతవరం మండలం మర్రిపాలం గ్రామానికి చెందిన యువకులు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:భాయ్ కుట్ర.. కూలీల పాలిట శాపం