శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసు శాఖ పాత్ర కీలకం. అయితే సంఘ విద్రోహుల వల్ల అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వీరు చేతులెత్తేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు తుపాకి వినియోగంపై ఏడాదికి ఒకటి, రెండు సార్లు మాత్రమే శిక్షణ తీసుకుంటారు. సరిహద్దుల్లోని సైనికుల్లా వీరు వేగంగా స్పందించలేరు. అందుకే ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ స్పెషల్ వెపన్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) బృందాన్ని తయారు చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఆర్మీ సిబ్బందికి తీసిపోని విధంగా వీరిని తీర్చిదిద్దారు.
కఠిన శిక్షణ
ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో పని చేస్తున్న మెరికల్లాంటి 33 మంది యువకులను స్వాట్‌కు ఎంపిక చేశారు. వీరికి విశ్రాంత ఆర్మీ అధికారులతో కఠినతరమైన శిక్షణ ఇప్పించారు. కిడ్నాప్‌నకు గురైన వీఐపీలను రక్షించడం, ఉగ్రవాదులు ఏదైన భవనాన్ని, ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే వారిని అక్కడ నుంచి తరిమివేయడం, వాహనాలల్లో తప్పించుకుంటే వారిని వెంబడించి పట్టుకోవడం... ఇలా క్లిష్టమైన పరిస్థితుల్లో చాకచక్యంగా పనిచేసే విధంగా వీరికి శిక్షణ ఇచ్చారు. ఇందులో ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. రోజూ వీరికి కఠిన శిక్షణ , ప్రతి వారం రైఫిల్ ట్రెయినింగ్ ఇస్తుంటారు. తుపాకీలను సునాయాసంగా వినియోగించడం, తుపాకీ భాగాలను విడగొట్టి, తిరిగి సిద్ధం చేయడం కూడా వీరి నైపుణ్యానికి నిదర్శనం.