కాకినాడ డివిజన్‌కు రెండు ఏఎస్‌వో పోస్టులకు ఒక్క అధికారీ లేరు. అమలాపురం ఏఎస్‌వోకు కాకినాడ డివిజన్ బాధ్యతలు అప్పగించారు. 16 మండలాలున్న కోనసీమలో మూడు, నాలుగు మండలాలకు ఒక ఎంఎస్‌వో మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో రెండేసి మండలాలకు ఒక ఎంఎస్‌వో చొప్పున ఉన్నారు. ఇదీ పౌర సరఫరాల శాఖలో పరిస్థితి. క్షేత్రస్థాయిలో చౌక దుకాణాలను పర్యవేక్షించే అధికారులు కొరతతో రేషన్ సరకులు పంపిణీ సజావుగా సాగడంలేదు. దీంతో ప్రతి నెలా రెండు లక్షల కుటుంబాల వరకు జిల్లాలో రేషన్ సరకులు అందుకోలేని పరిస్థితి.
ప్రజా పంపిణీ వ్యవస్థ పర్యవేక్షణకు అధికారుల కొరత వేధిస్తోంది. జిల్లాలో ఏడు రెవెన్యూ డివిజన్లకు 9 మంది సహాయ సరఫరా అధికారులకు (ఏఎస్‌వో) ముగ్గురు మాత్రమే ఉన్నారు. మండల సరఫరా అధికారులు(ఎంఎస్‌వో) 64 మండలాలకు గాను సగంమంది మాత్రమే ఉన్నారు.
పోస్టులు భర్తీకాక...
జిల్లాకు తొమ్మిది ఏఎస్‌వో పోస్టులు మంజూరవగా.. ఒక పోస్టును పౌర సరఫరాల శాఖ కమిషనరేట్‌లో వినియోగిస్తున్నారు. మిగిలిన ఎనిమిది మందిలో అమలాపురం, రాజమహేంద్రవరం గ్రామీణం, పెద్దాపురం డివిజన్లకు మాత్రమే ఉన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో సూపరింటెండెంట్ పోస్టులో ఒక ఏఎస్‌వో ఉండాలి. ఇది ఏళ్ల తరబడి ఖాళీగా ఉంది.
*జిల్లాలో 64 మండలాలకు 40 మంది ఎంఎస్‌వోలను కేటాయించారు. వీరిలో ముగ్గురు దీర్ఘకాలిక సెలవులో ఉండగా, ఐదు పోస్టులు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు ఎంఎస్‌వోల్లో ఒకరు కలెక్టరేట్‌లో, ఒకరు కలెక్టర్ సీసీగా వ్యవహరిస్తున్నారు. దీంతో 30 మంది ఎంఎస్‌వోలు మాత్రమే అందుబాటులో ఉన్నారు.
ఇవీ సమస్యలు...
అధికారుల పర్యవేక్షణ లేక చౌకబియ్యం పక్కదారి పడుతున్నాయి. కొందరు డీలర్లు రేషన్ బియ్యాన్ని పెద్దమొత్తంలో సేకరించి, మధ్యవర్తుల ద్వారా రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. కాకినాడ డివిజన్‌లో ఈ విధంగా అక్రమాలకు పాల్పడిన తొమ్మిది మంది డీలర్లను జేసీ ఇటీవల సస్పెండ్ చేశారు.