అమరావతి రైతుల దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అమలాపురంతోపాటు కోనసీమలోని మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల ఎదుట తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేశారు. మూడు రాజధానులు వద్దు- అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.
అమలాపురంలో ఆందోళన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనంద రావును పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం బాధాకరమని ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతికి మద్దతుగా ముమ్మిడివరంలో తెదేపా నేతలు, రైతు సంఘాల నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముమ్మడివరం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చి బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగన్ అధికారంలోకి రాకముందు మాట తప్పను-మడమ తిప్పను అని చెప్పి ఇప్పుడు ప్రతిదీ రివర్స్ పద్ధతిలో పాలన సాగిస్తున్నారని విమర్శించారు.
జగ్గంపేట నియోజకవర్గంలో తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు మద్దతుగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం సోమవరం గ్రామం నుంచి మురారి వరకు 1000 ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.