పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు కొన్నిచోట్ల రణరంగాన్ని తలపించాయి. గతనెలలో వాయిదా పడిన ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించగా.. పలుచోట్ల వైకాపా, తెలుగుదేశం పరస్పరం దాడులతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కొన్నిచోట్ల ఎన్నికలను మళ్లీ వాయిదా వేశారు.
సెప్టెంబర్ 22న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించగా.. పలు కారణాలతో చాలా చోట్ల వాయిదా పడ్డాయి. వాయిదా పడినచోట్ల ఇవాళ ఎన్నికలు జరగ్గా.. చాలాచోట్ల వైకాపా, తెలుగుదేశం వర్గాలుగా విడిపోయి పరస్పరం రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని ఏలేశ్వరం మండలం తిరుమాలిలో.. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. వైకాపా, తెలుగుదేశం వర్గాల మధ్య తీవ్రస్థాయి ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. వైకాపా శ్రేణులు పోలీసులు, ఉపాధ్యాయులపైనా రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్, మరో మహిళా ఉద్యోగికి గాయాలయ్యాయి. కొందరు గ్రామస్థులు కూడా గాయపడ్డారు. గతనెల 22న విద్యా కమిటీ ఎన్నికలోనూ ఘర్షణలు జరగ్గా అప్పుడు వాయిదా వేశారు. ఇవాళ మరోసారి నిర్వహిస్తున్న సమయంలోనూ అదే పరిస్థితి నెలకొంది.