తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన న్యాయవాది, గాంధేయవాది పొన్నాడ హనుమంతరావు.. 180 ఏళ్ల క్రితం నాటి తాళపత్రాలను ప్రదర్శించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీటిని ఈ తరానికి పరిచయం చేసేందుకే వెలుగులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. ఈ తాళపత్రాలను తన నివాసమైన గాంధీ హౌజ్ లో భద్రపరిచారు. 1844లో.. తమకు సంబంధించిన ఆస్తుల వివరాలను వీటిపై లిఖించారని.. తెలుగు సంవత్సరాల ప్రకారంగా ఇవి క్రోధి (1844)నామ సంవత్సరానికి చెందినవని.. హనుమంతరావు వివరించారు.
"మా తాత భానుమూర్తి. ఆయన తాతగారు గంగరాజు. 1859 కు ముందు కాలంలో మా తాత కరణంగా పని చేసేవారు. ఈ విషయాన్ని మా తండ్రి సూర్యారావు డైరీలో రాసుకున్నారు. ఈ తాళపత్రాలను మా తరతరాల సంపదగా భావిస్తున్నాం. ఏళ్ల తరబడి కాపాడుకుంటూ వస్తున్నాం. ప్రాచీన కాలంలో రామయణం, మహాభారతం వంటి గ్రంథాలను ఇలాంటి తాళపత్రాలపైనే లిఖించేవారు" - పొన్నాడ హనుమంతరావు, న్యాయవాది