తూర్పుగోదావరి జిల్లాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ప్రవాహం తగ్గిందని ఇళ్లూ వాకిలీ సర్దుకునేలోగా మరోసారి ఉద్ధృతి పెరగ్గా ముంపు గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకేసారి రెండు వరదలు వచ్చి కమ్మేసినట్లైందని వాపోతున్నారు. కోనసీమలోని లంక గ్రామాలే కాకుండా రాజమహేంద్రవరం ఎగువన ఉన్న సీతానగరం మండలంలోని ములకల్లంక సహా పలు గ్రామాలు వారం రోజులుగా నీటిలో నానుతూనే ఉన్నాయి. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏ చిన్న వస్తువు తెచ్చుకోవాలన్నా నావలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. పశుపోషణ మీదే ఆధారపడి జీవిస్తున్న ములకల్లంక ప్రజలను గోదావరి వరద కోలుకోలేని దెబ్బకొట్టింది. వరద ప్రవాహానికి పశుగ్రాసం, పంటలు పూర్తిగా నాశనమైపోగా... వందలాది మూగజీవాలు పస్తులుంటున్నాయి. రెండు రోజుల నుంచి వాటికి ఆహారం అందించలేకపోతున్నామంటూ పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.