తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాలుండగా.... ఇవి మూడు జిల్లాలుగా ఆవిర్భవించనున్నాయి. జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం అరకు పార్లమెంట్ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రంపచోడవరం వేరే జిల్లా పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వీటి సమగ్ర సమచారాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని కొత్త జిల్లాల ఏర్పాటుపై నియమించిన జిల్లాస్థాయి కమిటీకి కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ కమిటీలో జేసీ(రెవెన్యూ), ఎస్పీ, సీపీవో, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, డీఈవో, డీఎంహెచ్‌వో తదితరులు ఉన్నారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు.
విద్యాశాఖకు సంబంధించిన సమాచారాన్ని పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సిద్ధం చేస్తున్నామని డీఈవో అబ్రహం తెలిపారు. నియోజకవర్గాల వారీగా పాఠశాల, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సొంత భవనాలు, ఖాళీగా ఉన్న భవనాల వివరాలను సేకరించడానికి అన్ని శాఖల పరిధిలో కసరత్తు చేస్తున్నారు.
కొత్త కలెక్టరేట్లు ఇక్కడేనా..?
పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా కేంద్రం కానున్న నేపథ్యంలో కలెక్టరేట్ల ఏర్పాటుపైనా దృష్టిసారించారు. కాకినాడ పార్లమెంట్‌కు ప్రస్తుతం కలెక్టరేట్ ఉంది. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో సబ్ కలెక్టరేట్‌ను కలెక్టరేట్‌గా చేస్తారని.. ధవళేశ్వరం జలవనరులశాఖ అతిథి గృహం వద్ద కొత్త భవనం నిర్మిస్తారని ప్రచారం సాగుతోంది. అమలాపురంలో ఆర్డీవో కార్యాలయాన్ని కలెక్టరేట్ చేసే అవకాశం ఉంది. లేకపోతే కొత్త భవనం నిర్మాణం చేపడతారు. ఈ దిశగా కూడా కొత్త భవనాలు అవసరమైన చోట స్థల సేకరణపైనా దృష్టిసారించారు.
వీటి లెక్కలు తేలాలి...
ప్రస్తుతం జిల్లాలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ ఉన్నాయి. ఇవి వేరే జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంది. కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అక్కడి పరిస్థితి బట్టి మైదాన ప్రాంత ఐటీడీఏలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అటవీ ప్రాంతం కూడా వీటిలో చాలా తక్కువగా ఉండటంతో అటవీశాఖ కార్యాలయాలు కూడా తరలిపోతాయని భావిస్తున్నారు. ఈ దిశగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.