తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యాన శాఖ అధికారుల లెక్కల ప్రకారం 12,668 హెక్టార్లలో రైతులు అరటిని పండిస్తున్నారు. ప్రభుత్వపరంగా రావులపాలెం, అంబాజీపేటలో మార్కెట్ యార్డులున్నాయి. రావులపాలెం మార్కెట్ యార్డు నుంచి నిత్యం 25 వేల గెలలను తమిళనాడు, బిహార్, ఒడిశా, తెలంగాణ (హైదరాబాద్), కర్ణాటక రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ స్తంభించి అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. మొదట్లో అరటి మార్కెట్ యార్డులను మూసేశారు. ఆ తరువాత భౌతిక దూరం పాటిస్తూ యార్డులను తెరిచారు. స్థానిక వ్యాపారులు మాత్రమే యార్డులకు వస్తున్నారు. ప్రస్తుతం 5 వేల నుంచి 7 వేల గెలలు మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి.
కర్పూర పరిస్థితి దారుణం
దేవాలయాలు, శుభకార్యాలకు ఎక్కువగా కర్పూర అరటి ఉపయోగిస్తారు. కరోనా ప్రభావంతో శుభకార్యాలు లేకపోవడం, ఆలయాలు మూసివేయడంతో కర్పూర గెలలను కొనేనాథుడే లేడు. వేసవి తాపంతో గెలలు తోటల్లోనే మగ్గిపోతున్నాయి. యార్డుకు తెచ్చినా విక్రయాలు పూర్తిస్థాయిలో జరగక కొందరు రైతులు అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ఎర్ర చక్కెరకేళి అరటి కేవలం తమిళనాడుకు మాత్రమే ఎగుమతులు జరిగేవి. ఆ రాష్ట్రం దిగుమతులు నిలిపివేయడంతో ఒక్క గెల కూడా కదలని పరిస్థితి.
యార్డుల్లోనే విక్రయాలు
ఎకరం పంటలో సుమారుగా 700 అరటి మొక్కలు వరకు వేస్తారు. రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు అవుతాయి. ప్రస్తుత తరుణంలో కనీసం పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితం ఈదురు గాలుల కారణంగా అరటి పంట నేలకొరిగింది. కడప జిల్లాలో భుషావళి అరటిని యార్డు అధికారులు టన్ను రూ.3,500కు కొనుగోలు చేస్తున్నారు.