ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP Mahanadu: మహానాడులో మహా తీర్మానాలు.. యువతకే ప్రాధాన్యం అంటూ..! - TDP Mahanadu in Rajahmundry

Telugu Desam Party Political Resolutions: వచ్చే సార్వత్రిక ఎన్నికలు దోపిడీదారుడికి, పేదలకు మధ్య ఇక యుధ్ధమేనంటూ తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా రాజకీయ తీర్మానం చేసింది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. తోలి రోజు మహానాడు వేదికగా వైసీపీ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ వివిధ తీర్మానాలను తెలుగుదేశం ప్రవేశ పెట్టింది.

మహానాడులో మహా తీర్మానాలు.. యువతకే ప్రాధాన్యం అంటూ..!
TDP Mahanadu

By

Published : May 28, 2023, 10:14 AM IST

Updated : May 28, 2023, 12:01 PM IST

Telugu Desam Party Political Resolutions: రాష్ట్రంలో ఇక జరగబోయేది క్యాష్‌వార్‌ అంటూ తెలుగుదేశం పార్టీ రాజకీయ తీర్మానం ద్వారా వైసీపీను దుయ్యబట్టింది. సంపద దోచుకుంటున్న దోపిడీ దారులకు, పేదలకు మధ్య రాబోయే రోజుల్లో జరిగే యుద్ధం కీలక రాజకీయ పరిణామంగా పేర్కొంది. ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన ఈ తీర్మానాన్ని మరో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి బలపరిచారు.

దోపిడీ సొమ్మంతా తాడేపల్లి రాజప్రసాదానికి చేరుతోంది..రాష్ట్రంలో క్రిడ్‌ ప్రోకో, ఇన్‌సైడ్‌ ట్రేడింగ్, సూట్‌కేస్‌ కంపెనీలు, దోపిడీ, లూటీ వంటి పదాలన్నీ వినిపిస్తే గుర్తుకు వచ్చే ఒకేఒక్కడు జగన్మోహన్‌రెడ్డి అని. ల్యాండ్, శ్యాండ్, మైన్, వైన్, గంజాయి, డ్రగ్స్, రెడ్‌శాండల్‌.. ఇలా రాష్ట్రంలో పంచభూతాల్లో దేనినీ వదలకుండా లూటీ చేశాడు కాబట్టే.. దేశంలో ధనిక సీఎంగా గుర్తింపు పొందాడు. దోపిడీ సొమ్మంతా తాడేపల్లి రాజప్రసాదానికి చేరుతోందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మద్యమే కాకుండా, మైనింగ్‌లో రూ.35 వేల కోట్లు, ఇసుకలో రూ.12 వేల కోట్లు, సిలికా శాండ్‌లో రూ.10 వేల కోట్లు, భారతి సిమెంట్‌ ద్వారా రూ.12 వేల కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల్లో కమిషన్‌ ద్వారా రూ.2,500 కోట్లు, విద్యుత్‌ ఒప్పందాలు ద్వారా రూ.10 వేల కోట్లు, భూకుంభకోణాలతో రూ.40 వేల కోట్లు, పోర్టుల్లో అవినీతి ద్వారా రూ.4 వేల కోట్లు, అమూల్‌ కంపెనీ కమీషన్‌ ద్వారా రూ.వెయ్యి కోట్లు, ప్రభుత్వ కొనుగోళ్లు వాటా ద్వారా రూ.10 వేల కోట్లు, ఎర్రచందనం వాటాలో రూ.25 వేల కోట్లు, గంజాయి, డ్రగ్స్‌ ద్వారా రూ.10 వేల కోట్లు, లేపాక్షి కుంభకోణం ద్వారా రూ.15 వేల కోట్లు.. కలిపి మొత్తం నాలుగేళ్లలో రూ.2.27 లక్షల కోట్లు లూటీ చేశారని విమర్శించారు.

40 శాతం సీట్లు యువతకు..రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుప్రకటించారు. సమాజాన్ని మార్చే శక్తి ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. మహిళలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహానాడులో యువత సంక్షేమం.. యువగళంపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అయన ఆమోదించారు. ‘‘రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు రావాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. ఇప్పుడు ఇంట్లో ఉండిపోతే ఎలా సాధ్యం వేరే మార్గం లేదు. టీడీపీకు మద్దతుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా యువత ఆలోచించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీ ప్రాంతంలో జరిగే అలాంటి రాజకీయాలను అడ్డుకుని.. మీ భవిష్యత్తు కోసం రాజకీయాలు ఉండాలని నిలదీయాలన్నారు. యువత సంక్షేమం.. యువగళం తీర్మానాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ ప్రవేశపెట్టారు. దాన్ని పార్టీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షుడు కిమిడి నాగార్జున, తేజస్విని, తెలుగు యువత అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్, పొడపాటి తేజస్విని, తెలుగు యువత నాయకుడు వరుణ్‌కుమార్‌ బలపరచారు.

మహిళా సంక్షేమ తీర్మానం..రాష్ట్రంలోని మహిళలను మహాశక్తిగా తయారుచేసే కార్యక్రమాన్ని రూపొందించనున్నామని.. చంద్రబాబునాయుడు తెలిపారు. మహిళా శక్తిని గుర్తించింది.. నాయకత్వాన్ని పెంచింది టీడీపీయేనని తెలిపారు. ‘మహిళా సంక్షేమంలో కోతలు- అడ్డూ అదుపులేని అత్యాచారాలు, హత్యలు’ అంశంపై చేసిన తీర్మానాన్ని ఆయన మాట్లాడారు. ‘పురుషులకంటే తాము తక్కువ కాదని, ఒకడుగు ముందుంటామని తెలుగు మహిళలు చెప్పాల్సినవి బ్రహ్మాండంగా చెప్పారు. ఆదివారం నిర్వహించే ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల్లో మహిళలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని చంద్రబాబు వివరించారు. ‘సీత ఉసురు తగిలి లంక దహనమైంది. ద్రౌపది శాపంతో కౌరవ సామ్రాజ్యం కూలింది. రాజధాని అమరావతి కోసం నాలుగేళ్లుగా మహిళా రైతులు చేస్తున్న ఆందోళన, ఆవేదన, చిందిస్తున్న రక్తం, ఆక్రందన జగన్‌రెడ్డిని, ఆయన పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాయన్నారు. మహిళా సంక్షేమ తీర్మానం పైఆచంట సునీత, ఎం.కళ్యాణి, శివబాల తదితరులు మాట్లాడారు.

నేడు రోడ్లమీదే ప్రసవాలు జరిగే పరిస్థితులు..ఆదివాసీలకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది’అని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం, ఎస్టీల ద్రోహి జగన్‌ రెడ్డి అనే తీర్మానాన్ని మహానాడులో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ప్రవేశపెట్టగా, ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ ప్రసంగించారు. ‘మొన్న ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలోనూ అతన్నే(జగన్‌ను ఉద్ధేశించి) గెలిపించారు. తర్వాత ఆ సైకో గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో నేను ముఖ్యమంత్రిగా ఆదివాసీల కోసం చైతన్యం కార్యక్రమం తీసుకువచ్చా. గిరిజనుల ఆదాయాన్ని పెంచేలా అరకు కాఫీకి ప్రపంచమంతా బ్రాండింగ్‌ చేశాం. ఆసుపత్రులు, పీహెచ్‌సీలను అభివృద్ధి చేస్తే, అంబులెన్స్‌లు వెళ్లలేని చోటకు ఫీడర్‌ అంబులెన్స్‌ పంపి ఆరోగ్య సేవలనందిస్తూ ఇప్పుడు జగన్‌ పాలనలో అవనీ పోయి, మళ్లీ డోలీల్లో మనుషులను తీసుకువెళ్లడం, రోడ్లమీదే ప్రసవాలు జరిగే పరిస్థితులు వచ్చాయి’అని విమర్శించారు.

సంక్షోభంలో ఎస్సీ సంక్షేమం..దళితులపై దాడులు , హత్య చేసిన వారికి శిక్ష పడేలా చేసేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్‌ను తెస్తామని మహానాడు ప్రకటించింది.‘సంక్షోభంలో ఎస్సీ సంక్షేమం’ అనే తీర్మానాన్ని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మహానాడులో ప్రవేశపెట్టగా..టీడీపీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు, మహాసేన రాజేష్‌ఆ తీర్మానాన్ని బలపరిచారు.

జగన్‌ సీఎం అయ్యాక చాలా నష్టపోయాం..తెలంగాణలోని పరిస్థితులకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని చంద్రబాబు సూచించారు. మహిళలు మరింత అభివృద్ధిని సాధించేలా, అన్నదాతలకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. టీడీపీ హయాంలో మహిళలకు ఆర్టీసీ కండక్టర్లుగా ఉద్యోగాలిచ్చామని, డ్వాక్రా సంఘాల్ని తీసుకొచ్చామని చెప్పారు. మహానాడులో ‘తెలంగాణ మహిళాభివృద్ధి- సాధికారిత’, ‘రైతు సాధికారిత’ తీర్మానాలపై ఆయన మాట్లాడారు. ‘సమైక్య రాష్ట్రంలో టీడీపీ చేసిన పనుల వల్లే తెలంగాణకు ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడింది. మొదటిసారిగా మహిళలకు కళాశాలల్లో 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం. దీనివల్ల అమ్మాయిలకు ఉన్నతవిద్యలో దాదాపు సగం సీట్లు లభించాయి. విభజన సమయంలో రెండు రాష్ట్రాల మధ్య ఆదాయ వ్యత్యాసం చాలా తక్కువ. ఏపీలో జనాభా ఎక్కువ.. ఆదాయం తక్కువ కావడంతో తెలంగాణకు దీటుగా ఏపీ ఆదాయం పెంచేందుకు కష్టపడ్డాం. అసమర్థ జగన్‌ సీఎం అయ్యాక చాలా నష్టపోయాం. తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయింది’ అని విమర్శించారు.

మహానాడులో మహా తీర్మానాలు..

ఇవీ చదవండి:

Last Updated : May 28, 2023, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details