ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులకు బేడీల ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు - ఏపీ తాజా వార్తలు

అమరావతి రైతులకు బేడీలు వేసి అరెస్ట్ చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను ఈ విధంగా అవమానించడం ప్రభుత్వానికి తగదని అన్నారు. అన్నదాతలపై పెట్టిన అక్రమ కేసులు కొట్టివేసి వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

tdp leaders protest
రైతులకు బేడీలు వేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసన

By

Published : Oct 30, 2020, 2:22 PM IST

Updated : Oct 30, 2020, 6:20 PM IST

గుంటూరు జిల్లాలో...
అమరావతి రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ... రాజధాని గ్రామాల్లో రెండో రోజూ ఆందోళనలు కొనసాగాయి. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలంలోని రైతులు, మహిళలు నిరసన చేపట్టారు. తుళ్ళూరులో మహిళలు, రైతులు భారీ ర్యాలీ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ఎస్సీ రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తుళ్లూరు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం రహదారిపై భైఠాయించారు. శనివారం గుంటూరు లో జైల్​భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐకాస నేతలు వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లాలో..
రాజధాని రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై.. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం తదితరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. దళితుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైకాపా దళితులను అవమానాలకు గురి చేస్తోందని ఆరోపించారు. కాకినాడ కలెక్టరేట్​లోకి అమరావతి జేఏసీ ఆందోళనకారులు దూసుకొచ్చారు. ఫలితంగా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై నిరసనకారులను అదుపు చేశారు.

కృష్ణా జిల్లాలో..
కృష్ణా జిల్లా చందర్లపాడులో రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై.. తెదేపా నాయకులు నిరసన చేపట్టారు. దీన్ని దారుణమైన చర్యగా అభివర్ణించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతన్నలకు సంకెళ్లు వేసిన ప్రభుత్వ తీరుకు నిరసనగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నూజివీడులో ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు.

అనంతపురం జిల్లాలో..
అమరావతి ప్రాంత రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురంలో అమరావతి రైతులకు మద్దతుగా తెదేపా శ్రేణులతో కలిసి చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్న నిరసన చేపట్టారు. రాజధాని కోసం రైతులు ఉద్యమాలు చేస్తుంటే... కక్ష సాధింపుతో రైతులను అరెస్టు చేయడం సరికాదని హెచ్చరించారు.

రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానవీయం అని తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి చేతులకు సంకెళ్లు వేసుకుని నల్లబ్యాడ్జీలతో అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ భవన్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ.. కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు రాస్తారోకో చేపట్టారు. రాజధాని నిర్మాణం కోసం సాగు భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వారిని అవమానిస్తోందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులపై పెట్టిన కేసును ఉపసంహరించుకుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లాలో..
అమరావతి రైతుల అరెస్టుకు నిరసనగా చిత్తూరు జిల్లా పుత్తూరులో తెదేపా ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అన్నదాతలను సంకెళ్లతో జైలుకు తరలించడం సరైనది కాదని నాయకులు అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు బేడీలు వేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెదేపా నేతలు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చేతులకు సంకెళ్లు వేసుకుని ఆందోళన చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..
అమరావతిలో దళిత రైతులను అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన వైకాపా ప్రభుత్వం గద్దె దిగాలంటూ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెదేపా నాయకులు అందోళన చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అంబేడ్కర్ విగ్రహం వద్ద చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన చేపట్టారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేసి అరెస్ట్ చెయ్యడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

విజయనగరం జిల్లాలో..
అమరావతి రైతుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి తగదంటూ హితవు పలికారు.

ప్రకాశం జిల్లాలో...
ఇంకొల్లులో ప్రధాన రహదారిపై తెదేపా నేతలు నిరసన చేపట్టారు. రైతులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వంగా జగన్ సర్కార్ చరిత్రలో నిలిచిపోతుందని మండిపడ్డారు.

ఇవీ చదవండి..

రైతులకు సంకెళ్లు సిగ్గుచేటు: ఆనందబాబు

Last Updated : Oct 30, 2020, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details