Nara Lokesh Chit Chat: చంద్రబాబు నాయకత్వంలో ఎవరు పనిచేయకపోతే వాళ్లకి గుర్తింపు లేదని.. ఇందులో తనకి కూడా మినహాయింపు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియాతో చిట్ చాట్‌లో స్పష్టం చేశారు. ఇంఛార్జ్‌ల ప్రకటన జరిగినా, పనిచేయని వారికి టిక్కెట్లు రావన్నారు. పార్టీ తరఫున స్వచ్ఛంద సేవ చేస్తామంటే ఎవరినైనా ప్రోత్సహిస్తామని తెలిపారు.
పనిచేసే వారిని పోత్సహించాలి: నేను పని చేయను, ఇతరులూ చేయకూడదు అనే తత్వం సరికాదన్నారు. పని చేసేవారిని ఇన్ఛార్జ్లు ప్రోత్సహిస్తే సమష్టి కృషి అక్కడ ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. సేవా కార్యక్రమాలు చేసే వారు ఇన్ఛార్జ్కి సమాచారం ఇచ్చి వారి ఫోటో కూడా పెట్టి చేస్తే ఇబ్బంది లేదు, కానీ ఇన్ఛార్జ్ చెప్పినట్టే అన్నీ జరగాలంటే ఎలా అని ప్రశ్నించారు.
చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు: టిక్కెట్లు అనేవి నాయకుల సామర్ధ్యం బట్టి పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఇందులో లోకేశ్ అయినా.. వేరొకరైనా ఒక్కటేనని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సెంటు భూమి విలువ పెరగాలంటే చంద్రబాబు రావాలనే భావన లబ్ధిదారుల్లో ఉందన్నారు. సంక్షేమం అందుకుంటున్న నిరుపేదల కుటుంబాలు, తమ బిడ్డలకు ఉద్యోగ - ఉపాధి అవకాశాలు లభించాలంటే తెలుగుదేశం రావాలనే కోరుకుంటున్నారని అన్నారు.
వారు వస్తామన్నా అవసరం లేదు: తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చితే వైసీపీ చేసిన సంక్షేమం తక్కువ కాబట్టే దాని గురించి మాట్లాడట్లేదన్నారు. టీడీపీలో సముచిత స్థానం, గౌరవం పొంది.. స్వార్థంతో పార్టీ వీడిన కొందరు ఇప్పుడు వస్తామన్నా తమకు అవసరం లేదని స్పష్టం చేసారు. వారి స్థానంలో కొత్త తరం నాయకుల్ని తయారు చేసుకుంటామన్నారు.
అప్పుల ఊబిలో పేదలు: ఆర్5 జోన్లో 24 నెలల్లో ఇళ్లు కట్టాలని ఒత్తిడి తేవడం కోర్టు తీర్పునకు విరుద్ధం కాదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇళ్లు కట్టుకున్న పేదలు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ధ్వజమెత్తారు. ఇప్పుడుంటున్న వారు వేరొక చోటికి వెళ్లి.. నివాసం ఏర్పర్చుకుని ఉపాధి కోసం తిరగాలంటే రోజుకు 500 వరకూ ఖర్చవుతుందన్నారు. ఇప్పుడు ఉంటున్న ఇళ్లు జగన్మోహన్ రెడ్డి కూల్చబోతున్నాడనే విషయం పేదలకు అర్థమయిందని తెలిపారు. కొండ, అటవీ భూముల క్రమబద్దీకరణ చేస్తానని మంగళగిరిలో పేదలకు హామీ ఇచ్చానన్నారు.
మహానాడు వేదికగా యువతకి శుభవార్త: భుజం నొప్పికి చేసిన స్కాన్‌లో గాయాన్ని వైద్యులు గుర్తించారని.. గాయం తగ్గాలంటే కనీసం నెలరోజులైనా ఒత్తిడి పెట్టొద్దని వైద్యులు సూచినట్లు తెలిపారు. రాయలసీమలో పాదయాత్ర పూర్తయ్యే నాటికి ఆ ప్రాంత అభివృద్ధికి రూట్ మ్యాప్ ప్రకటిస్తామని వెల్లడించారు. తాగు, సాగునీటి వనరులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై రూట్ మ్యాప్ ప్రకటిస్తామన్నారు. మహానాడు వేదికగా రేపు యువతకి శుభవార్త చెబుతామన్నారు.
ఇవీ చదవండి: