TDP Leaders Comments in Mahanadu: వైఎస్ వివేకా హత్య కేసు సీఎం జగన్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. సీబీఐ లాంటి అతి పెద్ద నేర పరిశోధన సంస్థ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతోందని అన్నారు. హత్యారాజకీయాలకు కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనమంతా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మంచి మనస్సుతో చెప్పారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పిన పవన్ కల్యాణ్ కామెంట్లతో జగన్‌కు నిద్ర పట్టడం లేదన్నారు. ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ జెండాలు కడతారా అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.
జగన్ క్షమాపణ కోరాలి: జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న.. వైఎస్ వివేకా ఆత్మ క్షోభ మంత్రులకు వినిపించట్లేదా అంటూ మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. బాబాయ్‌ని చంపిన అబ్బాయి తీరు చూసి వైఎస్సార్ ఆత్మ కూడా క్షోభిస్తోందన్నారు. ఇప్పటికైనా సిగ్గు ఉంటే వైఎస్సార్ సమాధి వద్దకు వెళ్లాలని అన్నారు. పదవి కోసం బాబాయిని చంపినందుకు తప్పైపోయిందని.. వైఎస్సార్ సమాధి వద్ద క్షమాపణ చెప్పాలన్నారు.
చిన్నాన్నను చంపిన ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి నిలవబోతున్నాడని నిన్నటి సీబీఐ వాదనతో స్పష్టమైందని బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. మహానాడు స్పందన చూసి ఓర్వలేక మంత్రులు అప్పుడే విమర్శలకు దిగారని మండిపడ్డారు. వంచన మేనిఫెస్టోతో ప్రజల్ని మోసగించి.. టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.