తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు. పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. అర్హత గల పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ మృత్యుంజయరావుకు అందజేశారు.
కొత్తపేట నియోజక వర్గంలో..
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. పేదలకు ఉచితంగా రెండు సెంట్ల భూమి ఇవ్వాలని కోరుతూ మండల అధికారులకు వినతి పత్రాలను అందించారు.
పెద్దాపురం నియోజకవర్గంలో...
పెద్దాపురం నియోజకవర్గంలో లబ్ధిదారులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు తక్షణం పంపిణీ చేయాలని సామర్లకోట పట్టణం అమ్మణామ్మ గృహ సముదాయం వద్ద తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ‘నా ఇల్లు - నా సొంతం’ పేరుతో ధర్నా నిర్వహించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం తెదేపా ప్రభుత్వం ఇళ్లను నిర్మించిందని చినరాజప్ప తెలిపారు. వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేస్తే తెదేపాకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో వైకాపా ఇవ్వడం లేదని విమర్శించారు. చంద్రబాబు హాయంలో కట్టించారనే కారణంగానే పేదలకు ఇళ్లు అప్పగించకుండా సీఎం జగన్ వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఏడాదికి 5 లక్షల ఇళ్లు ఏవి?
17 నెలల పాలనలో ఒక్క ఇల్లు కూడా ఎందుకు నిర్మించలేకపోయారని రాజప్ప ప్రశ్నించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని వైకాపా మేనిఫెస్టోలో చెప్పారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. తెదేపా హాయాంలో రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్లు మంజూరు చేశామన్నారు.