TDP Leaders On Young Man Suicide Incident:తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో పోలీసులు కొట్టారని మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సీ యువకుడి కుటుంబాన్ని తెదేపా నేతలు పరామర్శించారు. తెదేపా నేతుల చిన రాజప్ప, జవహర్, ఆనందరావు బలుసుపేటలోని మృతుడు గిరీశ్ బాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
వైకాపా నాయకుల ఒత్తిడితో ఎస్సై అభిమన్యు దారుణంగా ప్రవర్తించి తనను దుర్భాషలాడటంతో పాటు.. తన కుమారుడిని తీవ్రంగా కొట్టి హింసించారని మృతుడి తండ్రి డేవిడ్ రాజు వాపోయాడు. వైకాపా పాలనలో ఎస్సీలను రక్షణ లేకుండా పోయిందని తెదేపా నేతలు ఆక్షేపించారు. ఎస్సీలందరూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడాలని వారు పిలుపునిచ్చారు.
ఏం జరిగిందంటే..
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని బలుసులపేటకు చెందిన దళిత యువకుడు ఆలపు గిరీష్‌బాబు (24) బుధవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైకాపాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశాడన్న కక్షతో, తప్పుడు కేసు పెట్టించి, పోలీసులతో కొట్టించి తన తమ్ముడి చావుకు కారణమయ్యారంటూ మృతుడి సోదరుడు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.