బాక్సైట్ దోచుకునేందుకు వైకాపా ప్రభుత్వం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తోందని తెలుగుదేశం ఆరోపించింది. విశాఖ మన్యం నాతవరం మండలం సిరిపురం పంచాయతీ పరిధిలో లేటరైట్ తవ్వకాలు, తరలింపును.. సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, నక్కా ఆనందబాబు నేతృత్వంలోని తెలుగుదేసం నిజనిర్ధారణ బృందం పరిశీలించింది. అన్నవరం నుంచి రౌతులపూడి మండలంలోని గిరిజన ప్రాంతం దబ్బాది వరకు పర్యటించి.. లేటరైట్ తవ్వకం, తరలింపునకు రిజర్వు ఫారెస్టులో వేసిన రోడ్డు గురించి గిరిజనులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
రౌతులపూడి మండలం జల్దాం నుంచి విశాఖ జిల్లా సిరిపురం వరకు కొండలు, గుట్టలు తొలిచి రోడ్డు వేసిన వైనాన్ని గిరిపుత్రులు తెలియజేశారు. 40 ఏళ్లుగా కాలిబాటలా ఉన్న దారిని ఆఘమేఘాల మీద విస్తరించారని.. నిత్యం వందలాది లారీలు ఖనిజం తరలిస్తున్నాయని తెలిపారు. రహదారి నిర్మాణం కోసం పచ్చని చెట్లను నరకడంతో పాటు పొలాల్ని బలవంతంగా లాక్కున్నారని.. పరిహారం అడిగితే బెదిరిస్తున్నారని గిరిజనులు చెప్పినట్లు తెలుగుదేశం నేతలు వెల్లడించారు.
బలవంతంగా స్టేషన్‌కు తరలింపు..
పరిశీలన అనంతరం తిరిగి రౌతులపూడి చేరుకున్న తెలుగుదేశం నేతలు మీడియా సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవగా అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని నేతలు నిలదీశారు. నాయకులు మాట్లాడేందేకు ప్రయత్నించగా.. పోలీసులు ఏమాత్రం అంగీకరించలేదు.
ఈ క్రమంలో పరస్పర వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మూడున్నర గంటలసేపు రౌతులపూడిలోనే వేచిఉన్న నాయకుల్ని.. పోలీసులు బలవంతంగా కోటనందూరు స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై తెలుగుదేశం నేతలను పోలీసులు విడుదల చేశారు. లేటరైట్ ముసుగులో వైకాపా చేస్తున్న బాక్సైట్ దోపిడీని బహిర్గతం చేశామన్న సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు.. పోరాటాన్ని ఇంతటితో ఆపబోమన్నారు.