Vangalapudi Anitha fire on YCP: ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసులను అరెస్టు చేయడం అన్యాయమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్‌ను పరామర్శించారు. అనంతరం ఆమె శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ సైకో పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. దానిలో భాగంగానే 30 ఏళ్లుగా నీతిగా వ్యాపారం చేస్తున్న ఆదిరెడ్డి అప్పారావు, వాసులను అరెస్టు చేశారన్నారు.
ఫిర్యాదు లేకుండా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అసలు చిట్‌ఫండ్ కంపెనీలో ఎలా మోసం చేస్తారో ఇప్పటికీ తనకు అర్ధం కావడం లేదన్నారు. త్వరలో రాజమహేంద్రవరంలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి సంబంధించి ఇటీవల తమ పార్టీ నాయకులు స్థల పరిశీలనకు వచ్చి వెళ్లారని, ఆ సందర్భం మినీ మహానాడును తలపించే సరికి జగన్‌కు చలిజ్వరం వచ్చిందని ఎద్దేవా చేశారు.
అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యగా కేసులు పెట్టి పైశాచికానందం పొందుతున్నారని ఆరోపించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై పెట్టే కేసులను తాము కిరీటాలుగా భావిస్తామన్నారు. ఎంత తొక్కాలని చూస్తే అంతకు రెట్టింపుగా టీడీపీ కార్యకర్తలు, నేతలు పైకి లేస్తారని తెలిపారు.
రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోని జగన్.. బాబాయ్ హత్య కేసులో తమ్ముడిని కాపాడుకునేందుకు మాత్రం నిత్యం దిల్లీ వెళ్లి వస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ వెళ్లిన ఏ ఒక్కసారి కూడా రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడలేదని ఆరోపించారు. కేవలం బాబాయి హత్య కేసులో ఉన్న వారిని రక్షించుకునేందుకు మాత్రమే.. దిల్లీ వెళ్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Vangalapudi Anitha: టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి.. జగన్ పైశాచికానందం పొందుతున్నారు "ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు.. గత 30 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నారు. 30 సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ముందుండి నడిపిస్తున్నారు. గత ఎన్నికల్లో 30 వేల మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే అదిరెడ్డి భవానీ. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ల కుటుంబాన్ని టార్గెట్ చేయాలని.. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సీఐడీని ప్రయోగించి.. పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా సీఐడీ పోలీసులు రావాల్సిన అవసరం ఏం వచ్చింది. మోసపోయామని ఎవరైనా ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. జగన్ రెడ్డి రాజ్యాంగంలో.. కంప్లైంట్ ఇవ్వకుండానే కేసులు పెడతారు.. కంప్లైంట్ ఇవ్వకుండానే జైలుకు పంపిస్తారు. ఒకటి గుర్తు పెట్టుకోండి.. టీడీపీ కార్యకర్తలను, నేతలను ఎంత తొక్కాలి అని చూస్తే అంత పైకి లేస్తారు". - వంగలపూడి అనిత, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు
ఇవీ చదవండి: