తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జిల్లా తెదేపా శ్రేణులు సమావేశం అయ్యారు. కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఇంటివద్ద భవిష్యత్ ప్రణాళిక, పార్టీ బలోపేతంపై జిల్లా తెదేపా నాయకులు చర్చించారు. వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు కార్యక్రమం ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభించిందని తెదేపా నేత చినరాజప్ప ఆరోపించారు.. మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి ప్రహారి గోడను కూల్చడాన్ని తెలుగుదేశం పార్టీ నిరసిస్తుందన్నారు. రాత్రివేళ కూల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని రాజప్ప ప్రశ్నించారు. ఒక మాజీ ఎంపీకే ఇలాంటి పరిస్థితి వస్తే.... సామాన్యులు ఎంత ప్రమాదకర పాలనలో ఉన్నారో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీవీ చర్చల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నందుకే సబ్బం హరిపై ఇటువంటి చర్యలకు పూనుకున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్, వైకాపా నేతల అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారును కొంతమంది దుండగులచే ధ్వంసం చేయించారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.... ఆటవిక రాజ్యంలో ఉన్నామనిపిస్తోందన్నారు. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించే వారిపై వరుస దాడులు జరుగుతున్నాయని రాజప్ప పేర్కొన్నారు.