వరదల వలన లంక గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వరదల కారణంగా వ్యాధులు ప్రబలి డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు వచ్చింది కరోనానా లేక ఇతర వ్యాధులా తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద ధాన్యం కొని నెలలు కావస్తున్నా.. వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయలేదని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు రూ. 600 కోట్లు, గోదావరి జిల్లాల్లో రూ. 100 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. పంట వేయడానికి పెట్టుబడి లేక అప్పుల కోసం అన్నదాతలు పరుగులు పెడుతున్నారన్నారు. సహకార రుణాలు వడ్డీతో సహా చెల్లించమని ప్రభుత్వం ఆదేశించడం రైతుల నడ్డి విరవడమేనని మండిపడ్డారు. సున్నా వడ్డీకే వ్యవసాయ రుణాలు అని చెప్పి.. ఇప్పుడు వడ్డీతో సహా చెల్లించమనడం అనైతికమన్నారు.