ఇళ్ల స్థలాల పేరుతో యథేచ్ఛగా వైకాపా నేతలు భూమాఫియా, భూదోపిడీకి పాల్పడుతున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో నివేశన స్థలాల్లో అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో బిక్కవోలు మండలం కాపవరంలో తెదేపా నిజ నిర్ధరణ కమిటీ బుధవారం పర్యటించింది. ప్రభుత్వం పంపిణీ చేసే నివేశన స్థలాలను అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజమహేంద్రవరం తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు జవహర్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
'ఇళ్ల స్థలాల పేరుతో యథేచ్ఛగా భూదోపిడీ' - tdp fact finding committee news
తూర్పుగోదావరి జిల్లా కాపవరంలో నివేశన స్థలాల్లో అక్రమ మైనింగ్ ఆరోపణలపై తెదేపా నిజ నిర్ధరణ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కొండను తొలిచి లోయ ప్రాంతంగా మార్చారని ఆరోపించారు. పూర్తి నివేదికను తెదేపా అధినేత చంద్రబాబుకు సమర్పిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
కాపవరంలో 30 అడుగుల కొండను లోయ ప్రాంతంగా మార్చారని నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రైవేటు సంస్థ నుంచి ఎకరాకు 35 లక్షల రూపాయల చొప్పున చెల్లించి 201 ఎకరాలు కొన్నారని ఆరోపించారు. స్థలాల చదును కోసం 2 అడుగుల వరకు మాత్రమే తవ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చినా... తాత్కాలిక అనుమతులతో వైకాపా పెద్దలు చక్రం తిప్పారని ఎమ్మెల్యే నిమ్మల దుయ్యబట్టారు. అధికారులతో కలిసి విచ్చలవిడిగా మట్టి దోపిడీ చేశారని ఆరోపించారు.
న్యాయ పోరాటం చేస్తాం..
రాష్ట్రంలో ముగ్గురు ప్రతినిధులు 3 ప్రాంతాలు పంచుకున్నారని తెదేపా నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అక్రమ మైనింగ్ పూర్తి నివేదికలను చంద్రబాబుకు సమర్పిస్తామని వెల్లడించారు. నివేదికను బట్టి న్యాయపరమైన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలను తెదేపా అడ్డుకుంటుందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని జ్యోతుల ధ్వజమెత్తారు.