Chandrababu naidu pressmeet : అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏం చేస్తోందో స్పష్టం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. 72 గంటల్లో దిగుబడులు పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరం కలిసి తిరుగుదాం అని నాయకులు, పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. అందులో భాగంగా ఈ నెల 9న తహశీల్దార్లకు వినతులు, 11న కలెక్టరేట్ల వద్ద వినతులు అందించాలని సూచిస్తూ.. 13న నిరసన దీక్షలకు పిలుపు నిచ్చారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలో చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పంటలు దెబ్బతింటే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహించారు.
ధాన్యం ఎందుకు తీసుకోవడం లేదు.. సంక్షోభం వస్తే భరోసా కల్పించాల్సిన సీఎం, మంత్రులు, అధికారులు రైతుల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. విధ్వంస పాలనతో రైతుల్ని నట్టేట ముంచారు.. రైతులకు బీమా కట్టలేదు.. ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నూకల వంకతో ధరలో కోత పెట్టడం దారుణం అని పేర్కొన్న బాబు.. కొనుగోళ్లలో కోత పెట్టకుండా డబ్బులు చెల్లించాలని అన్నారు. గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం ఎందుకు సేకరించలేదని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కోనసీమలో పర్యటన.. అంతకు ముందు అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. కోనసీమ జిల్లా వేగయమ్మపేటలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి, వారితో మాట్లాడి కష్ట, నష్టాలు తెలుసుకున్నారు. అకాల వర్షానికి తీవ్రంగా నష్టపోయామని చంద్రబాబు ముందు రైతులు గోడు వెల్లబోసుకున్నారు. వర్షానికి తడిసి ముద్దయిన ధాన్యం, దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ఇంకా 40 నుంచి 50 శాతం పంట కల్లాలు, చేలల్లోనే ఉందని, రైతులను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అని అన్నారు. ధాన్యం తడిసిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.. కౌలు రైతుల పరిస్థితి ఏమిటి అని సీఎం జగన్ను ప్రశ్నించారు. వాతావరణ హెచ్చరికలు ఉన్నా.. ఈ ప్రభుత్వానికి సకాలంలో గోనె సంచులు పంపించడం కూడా చేతగాదా?.. పంపించినవి వాటిల్లోనూ చిరిగినవి ఇస్తారా? అని మండిపడ్డారు. అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.