తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం గురువారం జోరుగా సాగింది. తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేత.. ఆరుసార్లు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రాజీనామా కలకలం చర్చనీయాంశమైంది. సీనియర్‌గా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, పార్టీలో సమస్యలపై సూచనలు పాటించకపోవడం.. బుచ్చయ్య సూచించిన వారికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి తాజా పరిణామాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. త్వరలో జరగనున్న రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో ఫోన్లో మాట్లాడేందుకు గోరంట్ల ప్రయత్నించి భంగపడినట్లు తెలుస్తోంది.
తనకు గుర్తింపు లేనప్పుడు దూరంగా ఉండటమే మేలని భావించి బుచ్చయ్య చౌదరి రాజీనామా యోచనలో ఉన్నారనే ప్రచారం సాగింది. గురువారం ఉదయం నుంచి రాజీనామాపై భిన్న స్వరాలు వినిపిస్తున్నా ఆయన మీడియాతో మాట్లాడకుండా ఇంట్లోనే ఉన్నారు. అధిష్ఠానం సూచనతో మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్ జవహర్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తదితరులు బుచ్చయ్య నివాసానికి చేరుకుని బుజ్జగించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో ఫోన్లో మాట్లాడించారు. ఏమైనా సమస్యలుంటే కూర్చుని మాట్లాడదామని వాళ్లు చెప్పడంతో సమస్య సద్దుమణిగినట్లయింది.
మాట్లాడి పరిష్కరించుకుంటాం: చినరాజప్ప