హిందూ బంధువులు ఆందోళనకు రాకముందే వేలం నిలిపివేసినందుకు ఆధ్యాత్మిక వేత్త, భాజపా నాయకుడు స్వామి పరిపూర్ణానంద ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శ్రీపీఠం నుంచి.. ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఇప్పటి వరకు పని చేసిన సీఎంలు దేవుళ్లకు, హిందువులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. వారి నిర్వాకం వల్ల 5 లక్షల కోట్ల పంట భూములు, లెక్కలేనన్ని ఆభరణాలు దోపిడీ అయ్యాయని ఆరోపించారు.
దేవాలయ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు అందించిన ఆస్తుల వివరాలు వారికి తెలియచెప్పటంలో తప్పులేదన్నారు. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు మీరు చేస్తే చరిత్రలో నిలచిపోతారని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. స్వామిజీలకు పీఠాధిపతులు చెప్పారని తిరుపతి ఆస్తులు అమ్మటానికి వీలులేదన్నారు. అలా చేస్తే స్వామీజీలపైనా కేసులు వేసి, వారి ఆస్తులు జప్తు చేయవచ్చునని వివరించారు.
హిందూ వ్యవస్థను కాపాడుకునేందుకే తన పోరాటమని స్పష్టం చేశారు. ఇప్పుడు స్పందించకపోతే హిందూ ధర్మం కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విజయవాడలో క్షుద్రపూజలు జరిగాయని పెద్ద ఆందోళన చేశారనీ, ఆ విషయాన్ని ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. పింక్ డైమండ్ విషయంలో ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పెద్దలే అప్పుడు ఆందోళన చేశారనీ, ఇప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు.