గోదావరి వరదలు సృష్టించిన విలయం తూర్పు గోదావరి జిల్లాలో రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. మన్యం నుంచి లోతట్టు ప్రాంతాల్లోని లంకల వరకూ పంటంతా జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. వరితో పాటు వివిధ రకాల ఉద్యాన పంటలు రోజుల తరబడి నీటిలో మగ్గిపోయాయి. ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్ పురం, దేవీపట్నం, సీతానగరం, రాజమహేంద్రవరం మండలాల్లోని పంటంతా నీటిలో నానిపోయి కుళ్లిపోయింది. ఇటు కోనసీమలో పంటనష్టం తీవ్రంగా ఉంది. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, సఖినేటిపల్లి, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లోని లంకలు, తీర ప్రాంత పంటపొలాలను భారీ వరద ముంచేసింది.
వరదనీటిలో 15 రోజుల పాటు పంట ఉండిపోవడంతో పూర్తిగా కుళ్లిపోయాయి. కోనసీమలోని లోతట్టు ప్రాంతాల్లో పంటలు ఇంకా నీటిలోనే తేలుతున్నాయి. దీంతో వరి పండించే రైతులకు ఖరీఫ్ సీజన్ చేజారే పరిస్థితి నెలకొంది. కూరగాయలు, ఇతర పంటలకూ రైతులులక్షల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయిలో బృందాలు పంట నష్టం అంచనా వేస్తున్నాయి. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బంది పంటనష్టం అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకూ పంట నష్టంపై ఒక అంచనాకు వచ్చామని అధికారులు చెబుతున్నారు.