కృష్ణా నదిలో 2017 నవంబరులో విహారానికి వెళ్లి 22 మంది మృత్యువాత పడిన ఫెర్రీ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలతో జీవో నెంబర్ 667 జారీ చేసింది. కానీ ఆ నియమాలు, నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయనడానికి 2018 మేలో జరిగిన గోదావరి పడవ ప్రమాదం, ఇప్పుడు మరోసారి గోదావరిలో జరిగిన ఘోర విషాదమే సాక్ష్యాలు.
నిబంధనలు ఇవి
నదిలో ప్రయాణించే బోట్లు, లాంచీలు రవాణాకు అనుకూలంగా ఉన్నాయని జలవనరుల శాఖకు సంబంధించిన కార్యనిర్వహక ఇంజినీరు నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ ధ్రువీకరణ పత్రం కాలపరిమితి కేవలం ఏడాదికి మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఆ బోటు నదిపైకి వెళ్లాంటే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ధృవీకరించాల్సిందే. కృష్ణా, గోదావరి నదిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే పర్యాటక శాఖ బోట్లు మాత్రమే ఈ నిబంధనలు పాటిస్తున్నాయి. ప్రైవేటు బోటుల నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అని పట్టించుకునే వారే కరవయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జలరవాణాకు ఆస్కారం ఉన్న ప్రతి జిల్లాలో రెవెన్యూ, పోలీస్, జలవనరుల, అగ్నిమాపక, పర్యాటక, మత్స్యశాఖలకు సంబంధించిన అధికారులతో జిల్లా స్థాయి కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేయాలి. జిల్లాలో జలరవాణాకు సంబంధించి మొత్తం పర్యవేక్షణ కమిటీ చేపట్టాలి. నదీ ప్రయాణానికి సంబంధించి ఎవరెవరికి లైసెన్సులు ఇచ్చారో పూర్తి జాబితాను ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కలెక్టర్‌కు సమర్పించాలి. లైసెన్సులు కలిగిన ప్రతి బోటును కమిటీలో ఉన్న అధికారులు తనిఖీ చేయాలి. బోటులో ఎంత మంది ప్రయాణించాలి, లైఫ్ జాకెట్ సౌకర్యం ఉందా లేదా, ప్రతి ఐదుగురు ప్రయాణికులకు ఒక బోయాకట్టె ఉందా లేదా అని క్షణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే బోటుకు అనుమతి ఇవ్వాలి. జిల్లా స్థాయి కమిటీ ఇచ్చిన సేఫ్ బోటు ధృవపత్రాన్ని బోటులో ప్రయాణికులు ఎక్కే ద్వారం వద్ద ప్రదర్శించాలి. అలా ఉన్న బోటు మాత్రమే నదిలో ప్రయాణించాలి. అనుమతులు లేని బోటు నదిలో ప్రవేశించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదు. ఇదంతా జరిగితే పడవ ప్రమాదాలు పునరావృతమయ్యేవి కావు.