తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు అమాత్యయోగం దక్కింది. రాష్ట్ర నూతన మంత్రిగా ఆయన ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు.
జిల్లాలోని రాజోలు నియోజకవర్గం శంకరగుప్తం శివారు అడవిపాలెంలో జన్మించిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ.. తొలిసారి కాకినాడ గ్రామీణంలో ఓడిపోయినా, 2019లో రామచంద్రపురం నుంచి గెలిచి ఇప్పుడు మంత్రి పదవి చేపడుతున్నారు. 2001లో రాజోలు జడ్పీటీసీ సభ్యునిగా గెలిచి తొలి రాజకీయ విజయం అందుకున్నారు. 2006లో మలికిపురం జడ్పీటీసీ సభ్యునిగా గెలిచి, జిల్లా పరిషత్ అధ్యక్షుడయ్యారు. 2008 నుంచి 2012 వరకు డీసీసీ అధ్యక్షునిగా, ఉమ్మడి రాష్ట్రంలో పీసీబీ సభ్యునిగా పనిచేశారు. 2013లో వైకాపాలో చేరి, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపికయ్యారు. 2014లో అక్కడే వైకాపా తరఫున పోటీచేసి స్వల్పతేడాతో ఓడిపోయారు. 2016 నుంచి 2018 వరకు వైకాపా జిల్లా అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. పార్టీ అధినేత ఆదేశాలతో 2019లో రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులుపై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ సంఘ అధ్యక్షునిగా కూడా పనిచేస్తున్నారు.