వ్యాయామశాలలో కసరత్తులు చేస్తున్న ఈ యువకుల పేర్లు గణేష్, రాజేష్. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన గణేష్‌ది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ శాఖలో ఒప్పంద ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. శరీర సౌష్ఠవం కోసం శ్రీ హనుమాన్ వ్యాయామ శాలలో చేరి...గత ఐదేళ్లుగా నిరంతర సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి కలిగింది. శరీర సౌష్టవ విభాగంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. 60 కేజీల కేటగిరీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు కైవసం చేసుకుంటున్నాడు. జాతీయ స్థాయి శరీర సౌష్ఠవ పోటీల్లో పతకం సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు.
శ్రీ హనుమాన్ వ్యాయామశాలలో శిక్షణ పొందుతూ పతకాలు సాధిస్తున్న మరో యువకుడు రాజేష్. పెద్దాపురం మండలం కట్టమూరుకు చెందిన రాజేష్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి వ్యవసాయ కూలీ.. తల్లి గృహిణి. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుకుంటూనే రాజేష్ ఉదయం, సాయంత్రం వ్యాయామశాలలో శిక్షణ పొందుతున్నాడు. 66, 70 కేజీల కేటగిరిల్లో పలు విజయాలు సాధిస్తున్నాడు. ఇతనికి దీపావళి పండుగ రోజు టపాసులు కాలుస్తుండగా....ఎడమ కన్నుకు తగిలి చూపు కోల్పోయాడు....అయినా శరీర సౌష్ఠవ పోటీల కోసం కఠోర సాధన చేస్తున్నాడు.