అత్తారింటికి అల్లుడు తెచ్చిన సారె అబ్బురపరిచింది. తెలుగు సంప్రదాయాల్ని మరోసారి గుర్తుచేసింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడకు చెందిన బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి పెద్ద కుమార్తె ప్రత్యూషదేవిని.. యానాంకు చెందిన తోటరాజు, నాగలక్ష్మి కుమారుడు పవన్ కుమార్‌కు ఇచ్చి మే నెలలో వివాహం చేశారు. తొలి ఆషాడం కావడంతో గత నెల యానాంలోని వియ్యాల వారికి బలరామకృష్ణ పంపిన సారె అబ్బురపరిచింది. అప్పట్లో ఊరూవాడ దాని గురించే చెప్పుకొన్నారు. ఇప్పుడు అదే తరహాలో.. యానాం నుంచి వియ్యాలవారు గాదరాడకు శ్రావణం సారె పంపించారు.
కొత్త అల్లుడు అత్తారింటికి నాలుగు వ్యాన్లలో తీసుకొచ్చిన సారెలో.. 20 రకాల స్వీట్లు ఉన్నాయి. అది కూడా వంద కేజీలో, రెండు వందల కేజీలో కాదు.. ఏకంగా పది వేల కేజీలు మిఠాయిలు తెచ్చారు. అలాగే వంద అరటి గెలలు, వివిధ రకాల పళ్లు, పూలు, చీరలు, రవిక ముక్కలతో.. శ్రావణం కావిళ్లు సమర్పించారు. కొత్త అల్లుడికి కాళ్లు కడిగి, హారతులతో సంప్రదాయపద్దంగా సారెను ఆహ్వానించారు.