ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కేంద్రపాలిత ప్రాంతం యానాంతో విడదీయరాని బంధం ఉంది. పుదుచ్చేరి పర్యాటక శాఖ ప్రతి ఏటా జనవరి ఆరో తేదీ నుంచి ఎనిమిది వరకు నిర్వహించే.. ప్రజా ఉత్సవాల్లో ప్రముఖులను సత్కరించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా 2018లో ఎస్పీ బాలసుబ్రమణ్యంను... పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయస్వామి, మంత్రి మల్లాది కృష్ణారావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏక్ దూజే కేలియే చిత్రంలో పాటను పాడి బాలసుబ్రమణ్యం అందర్నీ అలరించారు. 2002లో ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం ఫైనల్ ఎపిసోడ్‌ను యానాంలో నిర్వహించగా.. జడ్జిగా వచ్చిన బాలు మూడు రోజులు యానాంలోనే ఉన్నారు. అంతే కాకుండా యానాం చరిత్రను వివరిస్తూ పాటను పాడారు.
యానాంలో ఎస్పీ బాల సుబ్రమణ్యం జ్ఞాపకాలు
దివికేగిన గాన గంధర్వుడితో యానాంకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయని.. పుదుచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు గుర్తు చేసుకున్నారు. యానాం చరిత్రను వివరిస్తూ బాలు పాడిన పాట ఎప్పటికీ మరువలేమని అన్నారు.
యానాంలో ఎస్పీ బాల సుబ్రమణ్యం
బాలసుబ్రమణ్యం ఇకలేరు అన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పుదుచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు అన్నారు. బాలుతో ఎన్నో మధుర జ్ఞాపకాలు యానాంకు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. బాలసుబ్రమణ్యం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.