ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పక్కా ప్లాన్ వేశాడు.. స్నేహితులతో కలిసి తండ్రిని చంపేశాడు! - తండ్రిని చంపిన కుమారుడు వార్తలు

తూర్పుగోదావరి జిల్లా వీవీమెరకలో ఈ నెల 6న జరిగిన హత్య కేసు ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. వివాహేతర సంబంధం పెట్టుకొని, డబ్బు మొత్తం సదరు మహిళకు ఇస్తున్నాడనే నెపంతో కుమారుడే స్నేహితులతో కలసి తండ్రిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

తండ్రిని చంపిన కుమారుడు
తండ్రిని చంపిన కుమారుడు

By

Published : Mar 9, 2022, 7:15 PM IST

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వీవీమెరకలో ఈ నెల 6న జరిగిన హత్యకేసు ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. హత్య ఘటనపై అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..

వీవీమెరకకు చెందిన చొప్పల శేఖర్ బాబు(54) సుమారు 20 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. భార్య కూడా కొన్నేళ్లుగా గల్ఫ్​లోనే ఉంటోంది. మూడేళ్ల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చిన శేఖర్ బాబు.. స్థానిక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న శేఖర్ బాబు కుమారుడు శరత్ తండ్రిని మందలించాడు. ఆస్తులన్నీ అమ్మేసి సదరు మహిళకు ఇస్తున్నాడంటూ గత కొంత కాలంగా తండ్రికొడుకుల మధ్య వివాదం నడుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ద్విచక్రవాహనం కోసం రూ.80 వేలు ఇవ్వాలని శరత్ తన తండ్రిని అడిగాడు. శేఖర్ బాబు డబ్బు ఇవ్వకపోవటంతో తండ్రిపై విపరీతమైన కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా తన తండ్రిని అంతమెుందించాలని పథకం రచించాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తనతోపాటు చదువుతున్న ఆరుగురు స్నేహితులను ఈనెల 6న ఇంటికి పిలిపించుకున్నాడు. వారితో కలిసి మద్యం సేవించిన అనంతరం గాఢ నిద్రలో ఉన్న తండ్రి శేఖర్ బాబు కాళ్లు, చేతులను ప్లాస్టర్​తో కట్టేశారు. ఇనుప రాడ్డుతో శరీరం, తలపై విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. అనంతరం ప్రమాదశాత్తూ కింద పడిపోయాడని కుటుంబసభ్యులను నమ్మించి రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే శేఖర్ బాబు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మృతదేహంపై తీవ్ర గాయాలుండటం.. శరత్ చెబుతున్న సమాధానాలకు పొంతన లేకపోవడం.. వంటి కారణాలతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు నిజం బయటపడింది. తానడిగిన డబ్బు ఇవ్వకుండా వేరే మహిళకు ఆస్తులన్నీ అమ్మి ధారాదత్తం చేస్తున్నాడనే కోపంతో.. స్నేహితులతో కలిసి తండ్రిని చంపానని శరత్ ఒప్పుకున్నాడు. ఇవాళ అంతర్వేది బీచ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరిపరిచారు.

ఇదీ చదవండి
ఫేస్‌బుక్​లో "అల్లరి పిల్ల".. ఓసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమన్న పోలీసులు!

ABOUT THE AUTHOR

...view details