ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవయవ దానంతో నలుగురి ప్రాణాలు నిలిపిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి - brain dead person

అతనో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. కొవిడ్‌ నేపథ్యంలో ఊరికి వచ్చేశాడు. పుట్టినరోజు సందర్భంగా బంధువులను కలుసుకునేందుకు వెళ్తున్నాడు. అంతలో ఊహించని ప్రమాదం. వైద్యులు బ్రెయిన్‌డెడ్‌ అని తేల్చారు. అందొచ్చిన కొడుకు అందకుండా పోయాడనే పుట్టెడు దుఖంలో ఉన్నారు ఆ తల్లిదండ్రులు. అయినా మరికొందరి ప్రాణాలు కాపాడాలని తమ కుమారుడి అవయవాలను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు.

person
మృతుని పాతచిత్రం

By

Published : Oct 25, 2020, 12:47 PM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బిక్కిన కృష్ణార్జున చౌదరి సోదరుడి మనుమడు బిక్కిన శ్రీకాంత్‌(22) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తండ్రి బిక్కిన చక్రవర్తి వ్యాపారి. తల్లి శ్రీభాను గృహిణి. కరోనా కారణంగా శ్రీకాంత్​ ఇంటికి వచ్చేశాడు. గతనెల 24న పుట్టినరోజు సందర్భంగా బంధువులను కలుసుకునేందుకు బైక్‌పై యండగండి బయల్దేరాడు. వెదురుమూడి వద్ద ప్రమాదానికి గురై రోడ్డుపై పడిపోయాడు. మూడు గంటల అనంతరం మండపేటలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు రాజమహేంద్రవరం తరలించారు. నెల రోజులు చికిత్స అందించినా కోలుకోలేదు. బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలో మరికొందరి ప్రాణాలు కాపాడేందుకు, తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు వారు ముందుకొచ్చారు. ఇక్కడ సదుపాయం లేకపోవడంతో రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం శస్త్రచికిత్స చేసి గుండె ఒకరికి, కాలేయం మరొకరికి, కిడ్నీలు ఇద్దరికి దానం చేశారు. నలుగురి ప్రాణాలు కాపాడినందుకు తెలంగాణ ప్రభుత్వం వారికి ప్రశంసాపత్రం ఇచ్చింది. శ్రీకాంత్‌ మృతదేహాన్ని శనివారం మండపేటకు తీసుకొచ్చి, అంత్యక్రియలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details