తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ఇండుగమల్లి ప్రసాద్ కనిపించడం లేదంటూ ఆయన భార్య కౌసల్య గురువారం పోలీసులను ఆశ్రయించారు. గతేడాది జులై 18న మునికూడలి, కటావరం వద్ద ఇసుక రేవు వివాదంలో ప్రసాద్‌కు పోలీసు స్టేషన్‌లోనే అప్పటి ఎస్సై ఫిరోజ్ శిరోముండనం చేయించారు. ఈ ఉదంతం రాష్ట్రపతి కార్యాలయం వరకు చేరడంతో అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. తనకు శిరోముండనం చేయించిన, ప్రోత్సహించిన వైకాపా నాయకులను అరెస్టు చేయాలంటూ బాధితుడు గతంలో నిరసన దీక్షకు కూడా దిగారు. అప్పటి నుంచి ఈ కేసు విషయంలో పురోగతి లేదు.
దీంతో తీవ్ర మనస్తాపంతో ఉన్న బాధితుడు ప్రసాద్ తనకు ఇక న్యాయం జరగదని, శిరోముండనంపై సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని తరచూ వాపోయేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక తనను చూడలేరంటూ ప్రసాద్ బుధవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లాడని భార్య కౌసల్య చెప్పారు. ఈ మేరకు సీతానగరం ఠాణాలో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కోరుకొండ సీఐ పవన్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రసాద్‌ను పోలీసులే కనిపెట్టాలి: మాజీ ఎంపీ