కొవిడ్ సోకి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న పధ్నాలుగేళ్ల బాలికను ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎస్సై కృష్ణమాచారి. మామిడికుదురు మండలం నగరానికి చెందిన ఓ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకగా... తొమ్మిది రోజులుగా హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. వీరిలో 14 ఏళ్ల బాలికకు బుధవారం రాత్రి నుంచి శ్వాస అందక ఇబ్బంది పడింది.
ఆమెను ఆటోలో ఆసుపత్రిలన్ని తిప్పారు. పడకలు అందుబాటులో లేవని ఎక్కడా చేర్చుకోని కారణంగా.. సోంపల్లి కాటన్ పార్క్ వద్ద ఆటో నిలిపి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో దీనంగా విలపించారు. స్థానికంగా విధులు కరోనా నిర్వర్తిస్తున్న రాజోలు ఎస్సై కృష్ణమాచారి.. బాధితుల పరిస్థితి తెలుసుకుని హుటాహుటిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులతో మాట్లాడి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి మెరుగుపడింది. ఆపదలో మానవత్వంతో స్పందించిన ఎస్సైని పలువురు అభినందించారు.